Cm Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు సీరియస్, కుట్రలపై విచారణ జరిపిస్తామని ప్రకటన..

రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈ మెయిల్స్ పెట్టడాన్ని సీరియస్ గా తీసుకోవాలని పలువురు మంత్రులు చెప్పారు.

Cm Chandrababu: ఏపీ క్యాబినెట్ సమావేశంలో వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టబడులు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా వైసీపీ ప్రయత్నిస్తోందని మంత్రివర్గ భేటీలో మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఏపీ ఎండీసీ బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దని 200 కంపెనీలకు మెయిల్స్ పంపారని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ కుట్రలపై విచారణ చేయిస్తామని ప్రకటించారు.

రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందని క్యాబినెట్ భేటీలో ప్రస్తావించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఏపీఎండీసీ జారీ చేసిన బాండ్లల్లో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఏకంగా 200 దేశ, విదేశీ కంపెనీలకు తప్పుడు ఈ-మెయిల్స్ పెట్టారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తమ పార్టీ సానుభూతిపరుడితో వైసీపీనే మెయిల్స్ పెట్టించిందని సీఎంకు ఆధారాలు కూడా చూపారు పయ్యావుల కేశవ్.

Also Read: రాజధాని అమరావతిలో 34వేల ఎకరాల భూసమీకరణ, ఆ కుటుంబాలకు పెన్షన్.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బ తీసేలా వివిధ సంస్థలకు ఈ మెయిల్స్ పెట్టడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పెట్టుబడులు అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని మంత్రివర్గంలో ప్రకటించారు. తప్పులు చేసి.. ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకు నెట్టేయడమనే కుట్రలను మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తూనే ఉందని ధ్వజమెత్తారు.

నిధులు రాకుండా తెర వెనుక అడ్డుకోవడం, పథకాలు అమలు చేయడం లేదని ప్రజల్లో దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈ మెయిల్స్ పెట్టడాన్ని సీరియస్ గా తీసుకోవాలని పలువురు మంత్రులు చెప్పారు.

దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బ తీసేలా ఈ మెయిల్స్ పెట్టిన అంశంపై విచారణకు ఆదేశిస్తామన్నారు. మామిడి రైతుల విషయంలోనూ వైసీపీ ఇదే విధంగా తప్పుడు అంశాలను దుష్ప్రచారం చేస్తోందన్నారు. గతంలో అమరావతికి నిధులు రాకుండా వైసీపీ తప్పుడు ఫిర్యాదులు చేసిందని పలువురు మంత్రులు గుర్తు చేశారు.