AP Cabinet Decisions: రాజధాని అమరావతిలో 34వేల ఎకరాల భూసమీకరణ, ఆ కుటుంబాలకు పెన్షన్.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

సీబీఐ, జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్పోర్ట్స్‌ అకాడమీ వంటి వాటికి భూములు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.

AP Cabinet Decisions: రాజధాని అమరావతిలో 34వేల ఎకరాల భూసమీకరణ, ఆ కుటుంబాలకు పెన్షన్.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

Updated On : July 9, 2025 / 6:06 PM IST

AP Cabinet Decisions: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమైంది. 19 అజెండా అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఏఐఎస్ అధికారులకు నివాస సముదాయ భవనాలు పూర్తి చేసేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది క్యాబినెట్.

రాజధాని అమరావతికి మలి విడతలో 34వేల 964 ఎకరాల భూసమీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 13 గ్రామాల పరిధిలో భూసమీకరణ చేపట్టనున్నారు. సీబీఐ, జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్పోర్ట్స్‌ అకాడమీ వంటి వాటికి భూములు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. రాజధాని అమరావతి పరిధిలో ప్రభుత్వరంగ సంస్థ క్వాంటం కంప్యూటింగ్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రాజధాని అమరావతి పరిధిలో భూమి లేని దాదాపు 1575 పేద కుటుంబాలకు పెండింగ్ లో ఉన్న పెన్షన్ ను కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను కృష్ణ నది నుంచి డ్రెడ్జింగ్‌ చేసుకునేందుకు సీఆర్‌డీఏ కు మంత్రిమండలి అనుమతి ఇచ్చింది. జలవనరుల శాఖలో 71 పనులకు ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖలో వివిధ మీడియం ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది.

Also Read: లెనిన్‌కు మన ప్రాంతానికి ఏంటి సంబంధం..? విజయవాడలో లెనిన్ సెంటర్ పేరు మార్చాలి.. బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్

కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి విమానాశ్రయాలకు హడ్కో కింద వెయ్యి కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ రుణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ జలజీవన్ నీటి సరఫరా కార్పొరేషన్ ఏర్పాటునకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ బిల్లులో పలు చట్ట సవరణలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పరిశ్రమలు, కార్మిక బిల్లులో పలు చట్ట సవరణలకు ఆమోదం తెలిపింది.

* అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో ఏపీఐఐసీ పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్‌ ఏర్పాటుకు అదనంగా 790 ఎకరాలు సేకరించేందుకు ఆమోదం
* ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 2025-30కు ఆమోదం
* నెల్లూరు జిల్లాలో పెట్రో కెమికల్ పరిశ్రమ కోసం భూసేకరణ, 6 యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం
* కోకో రైతులను ఆదుకునేందుకు 14.88 కోట్ల మంజూరుకు ఆమోదం