CM Chandrababu : చంద్రబాబు పోలవరం టూర్.. ప్రాజెక్టు స్థితిగతులపై క్షేత్రస్థాయి పరిశీలన.. టూర్ షెడ్యూల్ ఇలా..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనతో పాటు ప్రాజెక్టు స్థితిగతులపై అధికారులతో సమీక్ష చేయనున్నారు.

Chandrababu Polavaam Tour : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనతో పాటు ప్రాజెక్టు స్థితిగతులపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఉదయం 11.45 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పర్యటన కొనసాగనుంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత పాలనను చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ఐదు హామీల అమలుపై సంతకాలు చేసిన సీఎం.. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే వారంవారం పోలవరం పనులను సమీక్షించాలని నిర్ణయించారు. ఇకపై ప్రతీ సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పోలవరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Also Read: CM Chandrababu : పోలవరం ప్రాజెక్ట్ విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ..

గతంలో సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టిపెట్టారు. ప్రతీ సోమవారం ఆయన పోలవరం పనుల పురోగతిని సమీక్షించేవారు.. ఎప్పటికప్పుడు నిర్మాణ సంస్థకు, అధికారులకు తగు సూచనలు చేసేవారు. మళ్లీ ఐదేళ్ల తరువాత చంద్రబాబు సీఎం అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి పోలవరం టూర్ కు సిద్ధమయ్యారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనతోనే ఏపీలో క్షేత్రస్థాయి పర్యటనలు చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలవరం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వనుంది.

Also Read: CM Chandrababu : చంద్రబాబు తొలి సంతకం కోసం ఫైల్ రెడీ

చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఇలా..
ఉదయం 11గంటలకు ఉండవల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరుతారు.
11.45 గంటలకు పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరుకుంటారు.
మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులను కలుసుకుంటారు.
మధ్యాహ్నం 12 గంటల నుండి 1.30 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలిస్తారు.
మధ్యాహ్నం 2.05 గంటల నుండి 3.05 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షిస్తారు.
సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడతారు.
సాయంత్రం 4గంటలకు ప్రాజెక్ట ప్రాంతం నుంచి హెలికాప్టర్ లో ఉండవల్లికి చంద్రబాబు బయలుదేరుతారు.

 

 

ట్రెండింగ్ వార్తలు