CM Jagan : సాయం చేయండి.. ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

ఏపీ సీఎం జగన్.. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్రం సాయం కోరారు. పేదలందరికి ఇళ్లు - పీఎంఏవైలో భాగంగా మౌలిక

Cm Jagan

CM Jagan : ఏపీ సీఎం జగన్.. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్రం సాయం కోరారు. పేదలందరికి ఇళ్లు – పీఎంఏవైలో భాగంగా మౌలిక సదుపాయాలు కల్పనకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాల కోసం ఏపీ ప్రభుత్వం రూ.23వేల 535 కోట్లు ఖర్చు చేసిందని సీఎం తెలిపారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు మొత్తం రూ.34వేల 109 కోట్లు అవుతుందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడం రాష్ట్ర ప్రభుత్వానికి భారం అవుతుందని చెప్పారు. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రానికి అండగా ఉండాలని సంబంధిత శాఖలను ఆదేశించాలని ప్రధాని మోడీని జగన్ ఆ లేఖలో కోరారు.

వాస్తవానికి సీఎం జగన్ ఢిల్లీ వెళ్లాలని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయారు. ఈ క్రమంలో ఓ లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అందులో ఏం రాశారంటే..

”ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) అనేది ప్రపంచంలోనే ఉత్తమ పథకం. ఈ పథకం ద్వారా… 2022 నాటికి పేదలందరికి పక్కా ఇళ్లు కల్పించాలి. అప్పటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. అందరికీ ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం PMAYని తెచ్చింది. ఇందులో భాగంగా… హౌసింగ్ కాలనీల అభివృద్ధి భారీ ఎత్తున జరుగుతోంది. గత ఏడేళ్లలో 308.2 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.2.99 లక్షల కోట్ల సాయం చేసింది. ఈ పథకంలో 3 కీలక అంశాలున్నాయి. 1. లబ్దిదారులకు స్థలాలు కేటాయించడం 2. కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకునేలా లబ్దిదారులకు ప్రభుత్వం సాయం చేయడం 3.రోడ్లు, కరెంటు, నీటి సప్లై, డ్రైనేజ్ సదుపాయాలను కాలనీల్లో నిర్మించడం.

అందరికీ ఇళ్లు అనే కేంద్రం ఆలోచనను ముందుకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 68వేల 381 ఎకరాల స్థలాన్ని ఈ పథకం కోసం కేటాయించింది. మొత్తం 17వేల 005 గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో… 30.76 లక్షల మంది లబ్దిదారులు ప్రయోజనం పొందబోతున్నారు. ఇందుకు అంచనా వ్యయం రూ.23,535 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లబ్దిదారులు 28.30 లక్షల పక్కా ఇళ్లు కట్టుకునేలా సాయం చేస్తోంది. ఇందుకు అంచనా వ్యయం రూ.50,944 కోట్లు కానుంది.

”ఇళ్ల నిర్మాణం అత్యంత నాణ్యంగా ఉండేలా రెండు పోస్టులను ఏపీ ప్రభుత్వం సృష్టించింది. 2022 నాటికి ఈ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందనే ఆశతో తాను ఉన్నాం. అయితే మౌలిక వసతులు కల్పించకుండా… ఇళ్లు నిర్మిస్తే సరిపోదు. మౌలిక వసతుల నిర్మాణానికి రూ.34,109 కోట్లు అంచనా వ్యయం అవసరం అవుతుంది. ఇంతటి భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించలేదు. ఈ విషయాన్ని పరిశీలించాలి. ఇళ్ల నిర్మాణం పూర్తైనా… మౌలిక వసతులు లేకపోతే… ప్రయోజనం ఉండదు. పెట్టిన ఖర్చంతా వేస్ట్ అవుతుంది. ఈ విషయాన్ని పరిశీలించి… పట్టణాభివృద్ది శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల వారితో చర్చించి… గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి” అని సీఎం జగన్ లేఖలో ప్రధాని మోడీని కోరారు.