మోడీ గారు ఏపీకి రండి సీఎం జగన్ ఆహ్వానం

  • Publish Date - February 12, 2020 / 06:40 PM IST

ఏపీ రాష్ట్రానికి రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సీఎం జగన్ ఆహ్వానించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరారు. ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందని ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు సీఎం జగన్. 2020, ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సుమారు గంటన్నరకు పైగా ఈ సమావేశం జరిగింది. ఏపీలో నెలకొన్న పరిస్థితులు, కేంద్ర సాయంపై చర్చించారు. 

రాజధాని తరలింపు..
రాజధాని తరలింపు, కౌన్సిల్‌ రద్దు అజెండానే సీఎం జగన్‌ ఢిల్లీ టూర్‌ సాగింది. కర్నూలుకు హైకోర్టును తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అసమానతలు తొలగించి సమగ్రాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నామని చెప్పారు సీఎం. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌గా అమరావతి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రధానికి వివరించారు. 

మండలి రద్దు :
శాసనమండలిని ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నదీ మోడీకి వివరించారు జగన్. ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం సలహాలివ్వాల్సిన శాసనమండలి.. అభివృద్ధికి అడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోందని చెప్పారు. అందుకే, మూడింట రెండు వంతుల మెజారిటీతో మండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ రికమెండ్‌ చేసిందని, దీనిపై వేగంగా స్పందించాలని కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 

పోలవరం ప్రాజెక్టు : 
2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు జగన్. పాలనా అనుమతులు త్వరగా వచ్చేలా చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 3,320 కోట్లు ఇప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పోలవరంపై సవరించిన అంచనాలను కూడా మోడీ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రత్యేక హోదా : 
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్ధిక సంఘం సిఫార్సులతో పనిలేదని 15వ ఆర్ధిక సంఘం చెప్పిన విషయాన్ని మోడీకి నివేదించారు. విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటును భర్తీ చేయాలని కోరారు. కడప స్టీల్‌ ప్లాంట్, రామాయపట్నం పోర్ట్, కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని కోరారు. వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయాలని కోరారు జగన్.