Adapa Seshu : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని.. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ మంత్రుల్ని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు ఏపీ మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ నేత అడపా శేషు (Adapa Seshu) స్పందిస్తూ పవన్ కల్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీపై పవన్ మరోసారి అక్కసు వెళ్లగ్రక్కారు అంటూ మండిపడ్డారు.
తమ మంత్రులు తెలంగాణను అక్కడి ప్రజల్ని ఏమీ అనలేదంటూ చెప్పుకొచ్చారు అడపాశేషు. మంత్రి హరీష్ రావు(Harish Rao) చేసిన కామెంట్స్ కి మా మంత్రులు సమాధానం ఇచ్చారని, ఇక్కడ అభివృద్ధి గురించి హరీష్ మాట్లాడితే.. తెలంగాణ లో పరిస్థితి గురించి మాట్లాడారని.. దీనికి పవన్ ఏపీ ప్రజల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మంత్రుల గురించి మాట్లాడే స్థాయి పవన్ కు లేదన్నారు. సీఎం జగన్ (CM Jagan) ఆదేశాల మేరకు ఏపి ప్రజల సంక్షేమం అభివృద్ది కోసం మంత్రులు నిరంతరం కృషి చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ రాజకీయ కక్షతోనే తమ మంత్రులపై బురద జల్లుతున్నారని.. ఎన్నికల ప్యాకేజ్ కోసం పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆరోపించారు శేషు. ఏపీలో చంద్రబాబు దగ్గర, తెలంగాణలో kcr దగ్గర ప్యాకేజ్ తీసుకుని పవన్ ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు.