Pawan Kalyan : వైసీపీ నేతలూ.. తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి : పవన్ కల్యాణ్
తెలంగాణ ప్రజలకు ఏపీ మంత్రులు క్షమాపణ చెప్పాలి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని..వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.

Pawan kalyan fire On AP ministers
Pawan Kalyan : ఏపీ మంత్రులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలకు ఏపీ మంత్రులు క్షమాపణ చెప్పాలి అంటూ పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రి హరీశ్ రావు విషయంలోకి ఏపీ మంత్రులు తెలంగాణా ప్రజలనుఎందుకు లాగుతున్నారు? రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవచ్చు కానీ మధ్యలో ప్రజలను ఎందుకు లాగుతున్నారు? అంటూ ప్రశ్నించారు పవన్ కల్యాణ్. తెలంగాణ ప్రజలను ఇష్టానుసారంగా మాట్లాడినందుకు ఏపీ మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని.. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
కాగా ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) విషయంలో ఏపీ తెలంగాణ నేతల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. అంతేకాదు టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా ఆవిర్భవించాక దేశ వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న క్రమంలో ఏపీలో కూడా గులాబీ పార్టీ కాలుమోపాలనుకుంటోంది. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ లో బీఆర్ఎస్ పాల్గొనలానుకోవటం వంటి పరిణామాలు కీలకంగా మారాయి. అలాగే బీఆర్ఎస్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయ లబ్ది కోసమే ఎత్తుగడలు వేస్తోందని మొదట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించి ఇప్పుడు బిడ్ వేస్తాననటంపై ఏపీ వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.
రాజకీయ లబ్ది కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బీఆర్ఎస్ వాడుకోవాలని చూస్తోందంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రులు కేటీఆర్(KTR), హరీశ్ రావులు ఏపీ అభివృద్ధిపై కూడా సెటైర్లు వేశారు. దీంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ మంత్రులపై ముఖ్యంగా హరీశ్ రావుపై విమర్శలు చేశారు. ఏపీలో అభివృద్ది గురించి తెలుసుకోవాలంటే ఇక్కడకు రండి అంటూ సవాల్ విసిరారు. తెలంగాణలో ఏముంది అంటూ ఎదురు విమర్శలు సంధించారు. దానికి తెలంగాణలో ఏముందో తెలుసుకోవాలంటే ఏపీ మంత్రులు తెలంగాణ వస్తే చూపిస్తామంటే హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.
ఇలా వైసీపీ, బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్న క్రమంలో తెలంగాణ ప్రజలు బుర్ర తక్కువ వారు అంటూ ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు(Seediri Appalaraju) ఎద్దేవా చేశారు. దీంతో పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని.. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.