Pawan Kalyan
Pawan Kalyan : ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఏజెన్సీ ఏరియాల్లో గంజాయి సాగు మాఫియా పని పడతామని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గంతో సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు. రెండు నెలలకోసారి మన్యం ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపిన పవన్.. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి కట్టడి చేసేదాకా వదలబోమని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో టూరిజం డెవలప్ చేసి ఉపాధి కల్పిస్తామన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లా బళ్లగరువులో పర్యటించారు. బళ్లగరువులో అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్.. గ్రామస్తులతో సమావేశం అయ్యారు.
”ఒక్కో నేలకు ఒక్కో సంప్రదాయం, ఆచార వ్యవహారాలు ఉంటాయి. గిరిజన సంప్రదాయాల్లో గ్రామ దేవతలకు కల్లు పెట్టడం ఆచారం. అలాగే గంజాయి ఆకుని ఇవ్వడం కూడా ఒక సంప్రదాయం. అలాంటి సంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క.. సంస్కృతి వరకు ఉండిపోతే పర్లే. గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే పర్లేదు. దాన్ని కమర్షియల్ చేశారు, ఎక్స్ పోర్ట్ చేశారు. ఎకరాలు ఎకరాలు, వేలాది హెక్టార్లలో పండించడం ప్రారంభమయ్యేసరికి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ గంజాయికి నెంబర్ 1 క్యాపిటల్ అయిపోయింది.
మీకు గంజాయి అనేది ఆదాయానికి మార్గం కాకూడదు. నేను యువతను కోరుకునేది అదే. సంపాదించడం చాలా తేలికగా ఉంటుంది. కానీ, దాని ద్వారా వచ్చే దుష్పలితాలు చాలా లోతుగా ఉంటాయి. గంజాయి సాగు చేస్తున్న యువతకు నా విన్నపం ఏంటంటే.. దయచేసి దాని జోలికి వెళ్లొద్దు. మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తాం” అని పవన్ కల్యాణ్ అన్నారు.
”గిరిజనులు గంజాయి ఆకుని గ్రామ దేవతకు నైవేద్యంగా పెడతారు. ఆచారంగా భావించినప్పుడు సమస్య ఉత్పన్నం కాలేదు. గంజాయిని కమర్షియల్ గా ఎప్పుడైతే ఆలోచన చేశారో సమస్య మొదలైంది. ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఒక మాఫియాలా మారింది. పోలీసులతోనే ఈ సమస్య పరిష్కారం కాదు.
స్థానిక యువ సర్పంచులు గంజాయి నిర్మూలనకు బాధ్యత తీసుకోవాలి. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపితే సమస్య పరిష్కారం అవుతుంది. రోడ్లు, టూరిజం అభివృద్ధి చేస్తే ఆదాయం పెరుగుతుంది. ప్రత్యామ్నాయం లేకుండా ఎన్ఫోర్స్ చేయడం సరికాదన్నది నమ్మే వ్యక్తిని నేను” అని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read : సినిమా వాళ్లపై సీఎం ఫైర్.. ఆ హీరోకి ఏమైందని సినీ ప్రముఖులంతా వెళ్లారు? ఆ కుటుంబాన్ని ఒక్కరైనా పరామర్శించారా?