హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం అని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan On Hydra : తెలంగాణలో సంచలనంగా మారిన హైడ్రాపై ఏపీలోనూ చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైడ్రా లాంటి సంస్థను తీసుకురావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ కట్టడాల విషయంలో కొందరు తెలియకుండా తప్పు చేసి ఉండొచ్చని, నోటీసులు ఇచ్చాక పునరావాసం కల్పించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు పవన్ కల్యాణ్.

” కొందరు వ్యక్తులు కబ్జాలు తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. భాగస్వాములతో మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి అన్నీ తెలియజేశాకే వాళ్లకు నోటీసులు ఇచ్చి, వాళ్లకు పునరావాసం చేసిన తర్వాతే కూల్చివేతల విషయంలో ముందుకెళ్లాలి. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read : ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లలో కుట్ర కోణం బలపడుతోంది- మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ కోసం రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రాను ఏర్పాటు చేసినప్పటి నుంచి అక్రమార్కులపై విరుచుకుపడుతోంది. చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తోంది హైడ్రా. అపార్ట్ మెంట్లు, ఖరీదైన విల్లాలను సైతం వదలడం లేదు. అక్రమ కట్టడాల కూల్చివేతల కోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ 25 స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలకు చెందిన కట్టడాలనైనా తగ్గేదే లేదంటోంది హైడ్రా. అక్రమ కట్టడం అని తేలితే చాలు కూల్చేస్తోంది. ఇక, సామాన్యులపైనా హైడ్రా కొరడా ఝళిపించడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే, తాము కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇళ్లు కొనుక్కొన్నామని, వాటికి ట్యాక్సుల కూడా కడుతున్నామని, ఇప్పుడు అవి అక్రమ కట్టడాలు అంటూ కూల్చేయడం కరెక్ట్ కాదని ఆ ఇళ్ల యజమానులు అంటున్నారు. కళ్ల ముందు తమ ఇళ్లను కూలుస్తుండటం చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. సామాన్య ప్రజల విషయంలో హైడ్రా తీరుపై కొంత విమర్శలు వస్తున్నాయి. తెలియక తప్పు చేసి ఉంటారని, అలాంటి వారి జోలికి వెళ్లకపోవడమే బెటర్ అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నోటీసులు ఇచ్చాకే, పునరావాసం కల్పించాకే కూల్చివేతలు చేయాలని పవన్ కల్యాణ్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, విజయవాడలో బుడమేరు సృష్టించిన వరద బీభత్సం తర్వాత.. ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థ రావాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బుడమేరు వాగును ఆక్రమించి ఇళ్లు కట్టడంతోనే బెడవాడ మునిగిపోయిందని అంటున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు బుడమేరును ఆక్రమించి వెంచర్లు వేశారు. తక్కువ ధరకు దొరుకుతున్నాయని మధ్య తరగతి ప్రజలు అక్కడ ప్లాట్లు కొని ఇళ్లు కట్టుకున్నారు. ఆ తర్వాత క్రమక్రమంగా అవి పెద్ద పెద్ద కాలనీలుగా విస్తరించాయి. ఇప్పుడీ ఆక్రమణలే బెజవాడకు శాపంగా మారాయని వాపోతున్నారు. దీంతో ఇక్కడ హైడ్రా తరహా వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు