Tiranga Rally: పాకిస్తాన్ కి మాస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. మీరు మా దేశంలోకి వచ్చి కొడితే.. మేము మీ ఇళ్లలోకి దూరి కొడతాం అని పాక్ ను హెచ్చరించారు పవన్ కల్యాణ్. అభివృద్ధి చెందుతున్న మన దేశాన్ని ఎలాగైనా వెనక్కి నెట్టాలి, అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నంలో పాకిస్తాన్ ఉందని పవన్ మండిపడ్డారు. దేశంలో ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఇంకా ఎంత కాలం అని పవన్ ప్రశ్నించారు. ఇది నయా భారత్, ఇది కొత్త భారత్, శాంతి వచనాలు పని చేయవు, సహనంతో చేతులు కట్టేశారు. ఇక చాలు.. అని పవన్ అన్నారు.
”పాకిస్తాన్ ను గత దశాబ్దాలుగా చూస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న మన దేశాన్ని ఎలాగైనా వెనక్కి నెట్టాలి, అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నంలో పాకిస్తాన్ ఉంది. దేశంలో ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడింది. దేశ సరిహద్దుల్లో ఇంత ప్రశాంత పరిస్థితులు ఉండవు. సైనికులకు మనం అండగా ఉందాం. సెక్యూలరిజం పేరుతో దేశ ఆర్మీని బలహీనపరిచే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకోవద్దు. వారికి బలమైన జవాబు చెప్పాలి.
వీర జవాన్ మురళీ నాయక్ దేశ భక్తి అందరికీ ఆదర్శం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. నిరంతరం ప్రధాని మోదీకి అండగా ఉందాం. పాకిస్తాన్ కు మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే.. మేము మీ ఇళ్లలోకి దూరి కొడతాం. అదే కరెక్ట్ సమాధానం వాళ్లకి. ఎంత కాలం ఇలా. ఇది నయా భారత్. ఇది కొత్త భారత్. శాంతి వచనాలు పని చేయవు. సహనంతో చేతులు కట్టేశారు. ఇక చాలు” అని పవన్ కల్యాణ్ అన్నారు.
విజయవాడలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పురందేశ్వరి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, విద్యార్థులు, బెజవాడ ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో సైనికులకు అభినందనలు తెలుపు ఈ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ సమైక్యత, సమగ్రత చాటేలా విద్యార్థులు గీతాలాపన చేశారు.