Tiranga Rally: మాతో పెట్టుకోవద్దు.. భారత్ జోలికి వస్తే అదే వారికి చివరి రోజు, ఉగ్రవాదులు ఎక్కడున్నా ఏరిపారేయాలి- సీఎం చంద్రబాబు
అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అని ప్రతీ ఒక్కరూ చెప్పాల్సిన తరుణం ఇది..

Tiranga Rally: భారత్ ఎవరి జోలికి వెళ్లదు, ఎవరిపైనా యుద్ధం చేయదని సీఎం చంద్రబాబు అన్నారు. కానీ, తీవ్రవాదుల రూపంలో దేశంపైకి వస్తే మాత్రం వారికి అదే చివరి రోజు అవుతుందని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వారిని ఏరిపారేయాలన్నారు. టెర్రరిస్టులు ప్రపంచంలో ఎక్కడ దాకున్నా వారి అంతు చూసేందుకు ధృడ సంకల్పంతో ప్రధాని మోదీ ముందుకెళ్తున్నారని చంద్రబాబు చెప్పారు. విజయవాడలో తిరంగా ర్యాలీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
”ఆపరేషన్ సిందూర్ లో మన సైనికుల ధైర్యం చూశాం. సామర్థ్యం చూశాం. మనం తయారు చేసుకున్న ఆయుధాల సత్తా చూశాం. ఆపరేషన్ సిందూర్ తో ఈరోజు ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్ట పెరిగింది. పొరుగు దేశాల్లో ఉండే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మేము ఎవరి జోలికి రాము, ఎవరిపైనా యుద్ధం చేయం, తీవ్రవాదుల రూపంలో మా దేశంపైకి వస్తే మాత్రం మీకు అదే చివరి రోజు అవుతుందని మరోసారి హెచ్చరిస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరి నినాదం కావాలి. అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అని ప్రతీ ఒక్కరూ చెప్పాల్సిన తరుణం ఇది” అని సీఎం చంద్రబాబు అన్నారు.
”దేశానికి సరైన సమయంలో సరైనా నాయకుడు, బలమైన నాయకుడు నరేంద్ర మోదీ ఉన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే సమర్థవంతమైన నాయకుడు కూడా మోదీనే. ఆపరేషన్ సిందూర్ తో ఆయన నిరూపించుకున్నారు. భారత్ రక్షణ శక్తిలోనే కాదు ఆర్థిక శక్తిలోనూ ముందుకు సాగుతోంది” అని చంద్రబాబు అన్నారు.
విజయవాడలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పురందేశ్వరి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, విద్యార్థులు, బెజవాడ ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో సైనికులకు అభినందనలు తెలుపు ఈ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ సమైక్యత, సమగ్రత చాటేలా విద్యార్థులు గీతాలాపన చేశారు.