ఏపీ ఎన్నికల కమిషనర్ పేరిట కేంద్ర హోం శాఖకు లేఖ..ఎవరు రాసుంటారు

  • Publish Date - March 19, 2020 / 01:34 AM IST

తనకు  ప్రాణహానీ ఉందని, తన కుటుంబానికి భద్రత కల్పించడి అంటూ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారంటే తేలికగా తీసిపారెయ్యలేం. కానీ నిమ్మగడ్డ రమేష్‌ కుమారే ఆ లేఖను రాశారా అన్న అనుమానం అందరిలోనూ ఉంది. ఈ లెటర్ చూస్తే మాత్రం సాక్షాత్తు నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా రాసినట్లుగానే కనిపిస్తోంది. కానీ ఆయన మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.

తాను ఈ లేఖను రాయలేదంటూ కొట్టిపారేస్తున్నారు. ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరుతో ఫేక్ లెటర్ సృష్టించి సాక్షాత్తు కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎంత ధైర్యం ఉంటే ఏకంగా కేంద్ర హోంశాఖకే ఫేక్‌ లెటర్‌ రాయాలనే ఆలోచన ఎలా వస్తుందనే వాదన కూడా సాగుతోంది. ఇంత సీరియస్‌ మ్యాటర్‌ను నిమ్మగడ్డ మాత్రం తేలికగా తీసుకున్నారు.

తాను లేఖ రాయలేదంటూ సాదాసీదాగా చెబుతున్నారు. ఈ ఫేక్‌ లెటర్‌పై దర్యాప్తు చేసి.. కారకులను కఠినంగా శిక్షించమని పోలీసు శాఖకు ఆదేశాలు అయితే ఇవ్వలేదు. ఒకవైపు తాను లేఖ రాయలేదంటూనే.. మరోవైపు విచారణకు మాత్రం ఆయన ఆదేశించడం లేదు. ఇక్కడే ఆయనపై అనుమానాలు మొదలవుతున్నాయి. అయితే లేఖ ఎవరు రాశారన్నది మాత్రం మిలియన్‌ డాలర్ల  ప్రశ్నగానే మిగిలింది.

కేంద్ర హోంశాఖకు అందిన లేఖపై వైసీపీ స్పందించింది. ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ పేరుతో విడుదలైన లేఖ టీడీపీ సృష్టేనని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కొట్టిపారేశారు. లేఖను చంద్రబాబే తయారు చేశారని.. ఈసీ సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించారు. స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని స్తంభింప చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని మండిపడ్డారు. దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు 2020, మార్చి 19వ తేదీ గురువారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. 

ఇదిలా ఉంటే…ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అండగా నిలిచారు. రమేష్‌కుమార్‌పై భౌతిక దాడులు జరగొచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఆయన లేఖ రాశారు. రమేశ్‌ కుమార్‌కు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించాలని కోరారు. స్పీకర్ తమ్మినేని సహా వైసీపీ నేతలు…కమిషనర్‌ను అవమానకరమైన భాషలో విమర్శించారని లేఖలో చెప్పారు. రమేశ్‌ కుమార్‌కు ఉన్నతస్థాయి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

Read More : All The Best : పదో తరగతి పరీక్షలు..అనారోగ్యంతో ఉన్నవారికి ప్రత్యేక గదులు