Chandrababu Naidu
Chandrababu Naidu : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఏపీ పైబర్ నెట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు 15మందికి ఊరట లభించింది. ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, సంస్థకు ఆర్థిక నష్టం వాటిళ్లలేదని సీఐడీ స్పష్టం చేయడంతో కేసును అధికారికంగా మూసివేశారు. సీఐడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తుది నివేదిక సమర్పించారు. కేసు మూసివేతకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పైబర్ నెట్ మాజీ, ప్రస్తుత ఎండీలు కూడా కోర్టుకు తెలిపారు.
Also Read: AP Rains : ఏపీ వైపు దూసుకొస్తున్న మరో వాయుగుండం.. అత్యంత భారీ వర్షాల అలర్ట్.. వాతావరణ రిపోర్ట్ ఇలా..
వైసీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు సహా మరికొందరిపై సీఐడీ కేసులు పెట్టింది. 2014-2019 టీడీపీ ప్రభుత్వం హయాంలో టెర్రాసాఫ్ట్ సంస్థకు ఆయాచిత లబ్ధి చేకూర్చారంటూ ఆరోపణలు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పైబర్ నెట్ ఎండీగా ఉన్న ఎం. మధుసూదనరెడ్డి 2021 సెప్టెంబరు 11న సీఐడీకి ఫిర్యాదు చేశారు. టెర్రాసాఫ్ట్ సంస్థకు రూ.321 కోట్ల లబ్ధిని చేకూర్చారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
2023లో అక్టోబర్11న చంద్రబాబు నాయుడు పేరును కూడా ఈ కేసులో చేర్చారు. ఆ సమయంలో చంద్రబాబుపై గత ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లారు. ఆ సమయంలోనే ఈ కేసుకూడా నమోదైంది. కేంద్రం భారత్ నెట్ పథకం కింద కేంద్రం రూ.3840 కోట్లు విడుదల చేయగా.. అందులో రూ.321 కోట్లు టెర్రాసాఫ్ట్‌కు బదలాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ రూ.321 కోట్లు టెర్రాసాఫ్ట్ కు బదలాయించినట్లు సీఐడీ నిర్దారించలేకపోయింది. దీంతో పైబర్ నెట్ కేసులో ఎలాంటి ఆర్థిక అక్రమాలు జరగలేదని సీఐడీ ధ్రువీకరించింది. గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసిన మధుసూదన రెడ్డే ఇప్పుడు ఈ ఫైబర్ నెట్ కేసును క్లోజ్ చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. అక్రమాలు జరగలేదన్న సీఐడీ నివేదికతో పూర్తిగా ఏకీభవించారు. దీంతో ఈ కేసు క్లోజ్ చేసినట్లైంది.