Ap Fishermen To Go Fishing From Today After Two Months Of Ban End
Fishing Ban End : తీర ప్రాంతంలో జూన్ 15 నుంచి తిరిగి సందడి వాతావరణం నెలకొంది. రెండు నెలల చేపల వేట విరామం అనంతరం తిరిగి చేపల వేటకు గంగ పుత్రులు సిద్దమయ్యారు. ఒకవైపు కొవిడ్, మరోవైపు వేట నిషేదంతో ఎన్నో మత్స్య కార కుటుంబాలు రెండు నెలల పాటు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిషేదిత కాలానికి ప్రభుత్వం తనవంతు సహాయంగా రూ. 10వేలు మత్స్య కారుల వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లలో జమచేసింది.
చేపల సంతతి పెంచేందుకు మత్స్య శాఖ ఈ తరహా నిషేదాన్ని ప్రతి ఏడాది అమలు చేస్తోంది. రెండు నెలల పాటు వేటను పక్కన పెట్టి ఇంటికే పరిమితమైన గంగపుత్రుల్లో ప్రస్తుతం నిషేదిత కాలం ముగియటంతో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 10 రోజులుగా వారంతా వేటకు సిద్దమయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బోట్లకు రిపేర్లు చేసుకోవటం, వలలను సిద్ధ చేసుకోవటం వంటి పనులన్నీ పూర్తిచేసుకున్నారు.
1995లో ఎపి ఫిషింగ్ మెరైన్ రెగ్యులేటింగ్ యాక్ట్ లో చేపల వేట నిషేదం నెలరోజుల పాటు కొనసాగించాలని పేర్కొన్నారు. 1997 నుండి ఆ ఆదేశాలు రాష్ట్రంలో అమల్లోకి వచ్చాయి. ఆ తరువాత కాలంలో నెలరోజుల కాలాన్ని రెండు మాసాలుగా పొడిగించారు. ఈ సమయంలో చేపలు గుడ్లు పెట్టి సంతతిని పెంచుకుంటాయి. ఒకరకంగా మత్స్య సంపదనే జీవనాధారంగా జీవిస్తున్న గంగపుత్రుల ఉపాధికి దోహదపడుతుందన్న ఉద్దేశంతో నిషేద అమలును అధికారులు కఠినతరంగా అమలు చేస్తూ వస్తున్నారు.
సముద్ర జీవరాశుల మనుగడకు ముప్పువాటిల్లకుండా కాపాడుకోవటం కోసం ఇలాంటి నిషేద విరామం మంచిదేనన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమౌతుంది. మరోవైపు కరోనా ప్రభావం నేపధ్యంలో మత్స్య సంపద ఎగుమతులకు అవరోధాలు ఎదరవుతున్నాయి. కొవిడ్ ప్రభావంతో చేపల మార్కెట్లకు నిబంధనలు పెట్టటంతో వాటిని అనుసరిస్తూ క్రయవిక్రయాలు సాగించాల్సి ఉంటుంది. ఇప్పటికే అధికారులు మత్స్య కారులకు తగు జాగ్రత్తలు, పాటించాల్సిన విధానాలను సూచించారు.