ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

AP government Vs SEC Nimmagadda : ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. నిమ్మగడ్డపై మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ఈ నోటీసులిచ్చారు. నిమ్మగడ్డ పరిధికి మించి వ్యవహరిస్తున్నారని మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. ఎస్‌ఈసీ వ్యవహారశైలిపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని, కోర్టుకు వెళ్లాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఎస్‌ఈసీ పరిధిపై కోర్టుకు వెళ్లే యోచనలో ఏపీ సర్కార్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

నిన్న ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ పెద్దలే టార్గెట్‌గా లేఖాస్త్రాలు సంధించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న తనపై ఉన్నతస్థాయిలో ఉన్న కొంతమంది ఉద్దేశ్య పూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు లోబడి నిష్పాక్షికంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న తనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ రాజకీయ ప్రకటనలు చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా సజ్జల వ్యవహరిస్తున్నారని నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. సజ్జలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను నిమ్మగడ్డ కోరారు. ప్రభుత్వ వేతనం తీసుకుంటూ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని… లక్ష్మణ రేఖను దాటారని ఫిర్యాదు చేశారు.

తనకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌పై నమ్మకం లేదని…ఈ విషయాన్ని అటార్నీ జనరల్ సలహా తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు నిమ్మగడ్డ. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జలను ఆ పదవి నుంచి తప్పించాలని కోరారు. ఈ విషయంతో తనకు కోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదని…అయితే చివరి ప్రయత్నంగా తమ దృష్టికి తెస్తున్నట్టు గవర్నర్‌కు లేఖ రాశారు. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్పై ప్రభుత్వం సీరియస్ అయింది. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స.. నిమ్మగడ్డపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు.