Andhrapradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పట్టణ ప్రాంతాల్లోని పొలిటికల్ లీడర్లకు భారీ శుభవార్త..

Andhrapradesh : ఏపీలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. వార్డుల పునర్విభజనకు సంబంధించి మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

AP Municipal Ward Increase

  • ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • కార్పొరేషన్‌లలో డివిజన్‌ల సంఖ్య..
  • మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య పెంపునకు నిర్ణయం
  • మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ

Andhrapradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లోని ద్వితీయ శ్రేణి రాజకీయ నేతలకు భారీ శుభవార్త వినిపించింది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. జనాభా సంఖ్య ఆధారంగా కార్పొరేషన్లలో డివిజన్లు, మున్సిపాలిటీల్లో వార్డులను విభజించనున్నారు.

Also Read : AP Rains : ఏపీ ప్రజలకు బిగ్‌అలర్ట్.. ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్ష సూచన.. బయటకు వెళ్లొద్దు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ..

వార్డుల పునర్విభజనకు సంబంధించి మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వార్డులు 23 నుంచి 52 మధ్య, కార్పొరేషన్లలో 60 నుంచి 120 వరకు డివిజన్లు ఉండాలని నిర్ణయించారు. చివరిసారిగా జరిగిన జనాభా లెక్కల ఆధారంగా వార్డుల విభజన ఉంటుందని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కొత్త నిబంధనల ప్రకారం.. జనాభా ప్రాతిపదికన డివిజన్ల సంఖ్యను ఈ కింది విధంగా నిర్ణయించారు.. రెండు లక్షలలోపు జనాభా ఉంటే 60మంది సభ్యులు, రెండులక్షల నుంచి మూడు లక్షల మంది జనాభా ఉంటే 62మంది సభ్యులు, లక్ష నుంచి 10లక్షల వరకు జనాభాను బట్టి 66 నుంచి 76 వరకు సభ్యులు ఉంటారు. 15లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పెద్ద కార్పొరేషన్లకు గరిష్ఠంగా 120 మంది సభ్యులను కేటాయించారు.

ఉదాహరణకు.. అనంతపురం మున్సిపాలిటీలో రెండున్నర లక్షల జనాభా ఉంది. ప్రస్తుతం 50 వార్డులు ఉన్నాయి.. 62కు పెరిగే అవకాశం ఉంది. గుంతకల్లులో లక్షకుపైగా జనాభా ఉంది. ప్రస్తుతం 37వార్డులు ఉన్నాయి. అవి 48 వార్డులకు పెరిగే అవకాశం ఉంటుంది. తాడిపత్రి మున్సిపాలిటీలో లక్ష జనాభా ఉంది. ప్రస్తుతం 36 వార్డులు ఉన్నాయి. వార్డుల పెంపు ప్రక్రియ పూర్తయితే.. 48 వార్డులకు పెరిగే అవకాశం ఉంది.

ఈ నిబంధనలు అమలులో ప్రభుత్వం కొన్ని కీలక షరతులను విధించింది. లోటు బడ్జెట్ లో ఉన్న స్థానిక సంస్థలు తమ నిధులను 16వ ఆర్థిక సంఘం లేదా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇతర పరిపాలనా ఖర్చులకు మళ్లించకూడదని స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికైన ప్రతినిధుల గౌరవ వేతనాలను పెంచకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. ఏపీలో వచ్చే ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని వార్డుల సంఖ్య పెంచాలని ఎమ్మెల్యేలు కోరినట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే సర్వే ప్రారంభించారని, అది పూర్తయ్యాక వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.