DWACRA womans
DWACRA womans : ఏపీలోని సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వారికి తక్కువకే ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా వారికి మరింత మేలుచేకూర్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గత కొంతకాలంగా రివాల్వింగ్ ఫండ్ విధానం సరిగా అమలు కాలేదు.. అయితే, మహిళలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ విధానాన్ని పునరుద్దరించింది. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు కొంత నగదును ప్రభుత్వం అందించనుంది.
ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైన సుమారు 2వేల డ్వాక్రా సంఘాలకు మూడు కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ నిధులను మంజూరు చేసింది. ఒక్కో సంఘానికి రూ.15వేల కింద ఈ రివాల్వింగ్ ఫండ్ అందించనున్నారు. అయితే, ఈ ఆర్థిక సహాయం 2024 ఆగస్టు 2వ తేదీ నుంచి 2025 నవంబర్ 30వ తేదీ మధ్య కాలంలో కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పటికే ఉన్న సంఘాలకు కాకుండా, తాజాగా మహిళలు సంఘాలుగా ఏర్పడి ముందుకు వచ్చిన వారిని ప్రోత్సహించేందుకే ఈ నిధులను కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రివాల్వింగ్ ఫండ్ కు మరో ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. దీని ద్వారా చిన్న వ్యాపారులు, ఉపాధి కార్యక్రమాలు ప్రాంరభించేందుకు మహిళలకు మార్గం సుగమమవుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.