ఏపీలో విద్యార్థులకు అద్భుత అవకాశం.. ఉచితంగా ఇంటర్‌తోపాటు IIT, JEE కోచింగ్
AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది.
- Harishth Thanniru
- Updated on- April 19, 2026 / 11:40 AM IST
CM Chandrababu Naidu
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనున్న సర్కార్
- ముస్లిం మైనార్టీ విద్యార్థులకు ఉచిత విద్య
- ప్రతీయేటా 500మందికి అవకాశం
AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలమేరకు నూతన పథకాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు.
Also Read : IPL 2026 : SRH సూపర్ విక్టరీ.. కావ్య పాప సంబరాలు అదుర్స్.. ఎగిరి గంతులేస్తూ.. వీడియో వైరల్
ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త పథకం అమలుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. వక్ఫ్ బోర్డు ఆదాయాన్ని ముస్లింల అభివృద్ధికి, విద్యా వికాసానికి వెచ్చించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తలీమ్-ఇ-హునార్ అనే పథకాన్ని ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చింది.
ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన పథకం ద్వారా ప్రతీ సంవత్సరం 500 మంది ప్రతిభావంతులైన ముస్లింల విద్యార్థులకు రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్యతోపాటు జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ పథకం పూర్తిగా వక్ఫ్ బోర్డు నిధులతో అమలు కానుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను మైనార్టీ సంక్షేమ శాఖ ఇప్పటికే ఖరారు చేసింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచే తలీమ్-ఇ-హునార్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి ముస్లిం యువతను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థి చదువు, వసతి కోసం ఏడాదికి సుమారు రూ.2లక్షల వరకు అవుతుందని అధికారులు అంచనా వేశారు. విద్యార్థుల ప్రగతిని వక్ఫ్ బోర్డు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు. అయితే, ఎంపికైన విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇందుకోసం రాష్ట్రంలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పెట్టి మంచి ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేయనున్నారు. వచ్చే నెలలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో ప్రతిభచాటిన విద్యార్థులు తమకు ఇష్టమైన కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తారు.
