AP pension guidelines: అనర్హుల పేర్లను పెన్షన్ల లబ్ధిదారుల నుంచి తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటివరకు భారీ సంఖ్యలో అనర్హుల్ని తొలగించింది. కానీ, ఈ క్రమంలో కొందరు అర్హుల పేర్లు కూడా జాబితా నుంచి తొలగిపోవడంతో గందరగోళం నెలకొంది.
అర్హులను మళ్లీ జాబితాలోకి చేర్చాలని పలువురు ప్రజాప్రతినిధులు సర్కారు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించాలని సన్నాహాలు చేసుకుంటోంది. జాబితా నుంచి తొలగించిన 2 రకాల పెన్షన్ల లబ్ధిదారుల పేర్లను మరోసారి పరిశీలించనున్నారు. వారిలో నిజమైన అర్హులు ఉంటే పెన్షన్ అందించనున్నారు.
ఈ ఏడాది జనవరిలో ఏపీ సర్కారు ఆరోగ్య, దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తున్న విధానాన్ని పరిశీలించేందుకు గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఆసుపత్రుల్లో జనవరి 6 నుంచి లబ్ధిదారుల్ని పరిశీలించారు. 23,352 ఆరోగ్య పెన్షన్లు, 5.22 లక్షల దివ్యాంగుల పెన్షన్లను పరిశీలించి, అనర్హులుగా తేలిన వారికి నోటీసులు ఇచ్చారు.
Also Read: తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఫైనాన్షియర్ ఇంటిని తగులబెట్టిన బాధితులు.. ఉద్రిక్తత
అయితే, వారిలో అర్హులు ఉంటే అప్పీలు చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. తాజాగా, వీరిలో అర్హులను గుర్తించేందుకు ఏపీ సర్కారు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు గైడ్‌లైన్స్ ఇచ్చింది. సచివాలయాల వారీగా పరిశీలన కోసం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తేదీలు ఇస్తారు.
డీసీహెచ్ఎస్, మెడికల్ సూపరింటెండెంట్ల సాయంతో పెన్షన్ దారులను ఆయా ఆసుపత్రులకు మ్యాప్ చేయాలి. పెన్షన్ కోరుతున్నవారు ఏయే తేదీల్లో ఆసుపత్రులకు వెళ్లాలో తేదీలు ఖరారు చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఈ సమాచారాన్ని సచివాలయకు ఇవ్వాలి.
పంచాయతీ కార్యదర్శులు, వార్డు అడ్మిన్ కార్యదర్శులు పెన్షన్ల పరిశీలన కోసం మళ్లీ ఇక్కడ తేదీలు కేటాయిస్తారు. అక్కడకు మీరు వెళ్లి మీరు పెన్షన్లకు అర్హులని వివరాలు తెలపాలి. ఈ నెల 8 నుంచి సచివాలయాల్లో పరిశీలన ప్రారంభం అవుతుంది.