AP Govt Auto Drivers
AP Govt Auto Drivers : రాష్ట్రంలోని అర్హులైన ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ యాజమానులకు, డ్రైవర్‌గా స్వయం ఉపాధి పొందుతున్న వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు (AP Govt Auto Drivers) రవాణాశాఖ విడుదల చేసిన జీవోలో పేర్కొంది.
Also Read: Ganta Srinivasa Rao: అయ్యో గంటా..! ఎంత కష్టమొచ్చే..? మంత్రి పదవి దక్కకపోవడానికి కారణం అదేనా?
గత వైసీపీ ప్రభుత్వంలో వాహన మిత్ర పేరుతో రూ.10వేలు ఆర్థిక సహాయం చేయగా.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆటో మిత్ర పేరుతో రూ.15వేలు ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయించింది. 2025 -26 ఆర్థిక సంవత్సరానికి విధివిధానాలు ఖరారు చేస్తూ శనివారం రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. బీమా, ఫిట్ నెస్ సర్టిఫికెట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం ఈ సాయం అందజేయనుంది.
ఈ పథకంలో భాగంగా ఈనెల 13వ తేదీ నాటికి ఉన్న పాత లబ్ధిదారుల జాబితాను పరిగణించడంతో పాటు కొత్త దరఖాస్తులకు ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రామ, వార్డు సచివాలయాల విభాగం (జీఎస్‌డబ్ల్యూఎస్‌డీ) దరఖాస్తుల స్వీకరణకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేస్తుంది. ఈనెల 22 నాటికి సచివాలయం, మండల, జిల్లా స్థాయి క్షేత్ర పరిశీలన పూర్తి చేసి.. ఈనెల 24వ తేదీనాటికి తుది జాబితాను సిద్ధం చేస్తారు. తుది జాబితా ప్రకారం.. అక్టోబర్ 1వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది.
♦ ఏపీలో జారీ చేసిన ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సును దరఖాస్తుదారులు కలిగి ఉండాలి.
♦ ఒకవేళ ఆటో రిక్షా విషయంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోయినా 2025 -26 సంవత్సరానికి అనుమతిస్తారు. అయితే, ఒక నెలలోపు ఆ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
♦ వాహనం ఏపీలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి.
♦ దరఖాస్తు దారులు దారిద్ర్య రేఖకు దిగువన (బీపీఎల్) ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉండాలి.
♦ దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్ గా ఉంటే అనర్హులు. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది.
♦ ఇంటి విద్యుత్తు వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. దరఖాస్తు తేదీకి ముందు 12నెలల సగటు లెక్కిస్తారు.
♦ వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు.
♦ మాగాణి అయితే మూడు ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి.
♦ పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస, వానిజ్య నిర్మాణం ఉండకూడదు.