AP Govt
AP Govt : దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం.. ఉద్యోగులకు 3.64శాతం డీఏ పెంచారు. ఈ పెంపు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
పెన్షనర్లు/కుటుంబ పెన్షనర్లకు చెల్లించాల్సిన డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) 3.64శాతంను ప్రభుత్వం పెంచింది. 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న 3.64శాతం డీఆర్ పెంపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీసీఎఫ్ ఎంఎస్ సీఈవోని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
రెండు రోజుల క్రితం ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు సోమవారం ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. కొత్త డీఏతో పాటు సంబంధిత బకాయిలు కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.
ప్రభుత్వం విడుదల చేసిన జీవోతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.