House And Pensions: రెండేళ్లలో మొత్తం 9లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేసేలా హౌసింగ్ విభాగం చర్యలు తీసుకుంటుందని మంత్రి పార్థసారధి తెలిపారు. గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
అనంతరం మంత్రులు నారాయణ, పార్థసారధి వివరణ ఇచ్చారు. గృహ నిర్మాణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసిందని, 6 లక్షల మందికి గృహ అవసరాలు ఉన్నట్లుగా గుర్తించామని మంత్రులు తెలిపారు.
ఎంతమందికి ఇళ్లు కావాలి అనేదానిపై మరో 15 రోజుల్లో సర్వే నిర్వహిస్తామన్నారు.
ఎన్టీఆర్ హౌసింగ్ కింద గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులు వెంటనే మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. హౌసింగ్, టిడ్కో కలిపి 2లక్షల ఇళ్లు సంక్రాంతికి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పీఎంఏవై కింద మిగిలిన 5 లక్షల ఇళ్లను రెండో ఏడాది పూర్తి చేయాలని, రెండేళ్లలో మొత్తం 9 లక్షల ఇళ్లు పూర్తి చేసేలా హౌసింగ్ విభాగం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. (House And Pensions)
గత ప్రభుత్వం 2వేల 900 కోట్ల రూపాయల కేంద్ర నిధులను దారి మళ్లించిందని మంత్రి నారాయణ ఆరోపించారు. అప్పటి ఆర్థిక అవకతవకలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
గత ప్రభుత్వం తప్పిదం కారణంగా లబ్దిదారులు చెల్లించాల్సిన రూ.140 కోట్లను సీఎం ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు.
సెప్టెంబర్ 15 కల్లా 3 లక్షల ఇళ్లు పూర్తి..
”అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మాణం చేసి ఇవ్వాలి అనే లక్ష్యంతో పని చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు హౌసింగ్ డిపార్ట్ మెంట్ లో 2.81 లక్షల ఇళ్లు పూర్తి చేయడం జరిగింది.
సెప్టెంబర్ 15 కల్లా 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా వీటిని ప్రారంభిస్తాం. గత ప్రభుత్వం పాలసీలు మార్చి అంతా నాశనం చేసింది.
పాలసీలు మార్చినా ఇంప్లిమెంట్ చేయలేదు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదు. లబ్దిదారుల పేరుతో లోన్స్ తీసుకుని నిధులను దారి మళ్లించారు.
2029 నాటికి ఇల్లు లేని పేదలు ఉండరు. సెప్టెంబర్ నాటికి 3 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం” అని మంత్రులు పార్థసారధి, నారాయణ తెలిపారు.
కొత్తగా లక్ష మంది పెన్షన్లు..
”అర్హత ఉన్న ఒక్క దివ్యాంగుడికి కానీ, అర్హత ఉన్న ఒక్క వృద్ధుడికి కానీ, అర్హత ఉన్న ఒక్క వితంతువుకి కానీ మేము పెన్షన్లు కట్ చేయము.
పెన్షన్ పొందుతూ మరణించిన వృద్ధుల భార్యలకు వెంటనే పెన్షన్ ఇచ్చేలా కార్యక్రమం మొదలు పెట్టాం.
లక్ష 9వేల 155 మందికి కొత్తగా పెన్షన్లు శాంక్షన్ చేశాం. ప్రజలు కూడా ఆలోచించాలి. అర్హత ఉన్న వారికి ఇవ్వమంటారా? అర్హత లేని వారికి ఇవ్వమంటారా? ఒకసారి ఆలోచించాలని మనవి చేస్తున్నాం” అని మంత్రి పార్థసారధి చెప్పారు.
Also Read: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు జగన్ మద్దతు.. ప్లానేంటి..?