Bakrid Prayers Guidelines
ap govt bakrid bakrid prayers guidelines covid-19 : ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పర్వదినం బక్రీద్ సమీపిస్తోంది. ఈ నెల 20, 21 తేదీల్లో బక్రీద్ జరుపుకోవడానికి ముస్లింలు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఏపీలో కోవిడ్ నియంత్రణ కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా బక్రీద్ నిర్వహణకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలపై నిషేధం విధిస్తున్నట్టు మైనార్టీ సంక్షేమ శాఖ ప్రకటించింది. భారీ జన సమూహాలను నివారించేందుకు మసీదుల్లో మాత్రమే ప్రార్థనలకు అనుమతి ఇచ్చింది.
మసీదుల్లోనూ భౌతికదూరం పాటించాలంది. మసీదుల్లో 50శాతం మందికే అనుమతి ఇచ్చింది. మాస్కులు లేకుంటే మసీదుల్లోకి అనుమతించొద్దని కమిటీలకు ఆదేశాలు అందాయి. మసీదు ప్రాంగాణాల్లో శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
వృద్ధులు, పిల్లలు ఇంటి దగ్గరే ప్రార్ధనలు చేసుకోవాల్సిందిగా సూచనలు చేశారు. ఈద్ మిలాప్, ముసాఫా, ఆప్తులను కౌగిలించుకోవటం లాంటి కార్యక్రమాలను చేయొద్దని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం. అలాగే మాంసం విక్రయ కేంద్రాల్లోనూ కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఒకేచోట గుమికూడటం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమవుతుందని ప్రభుత్వం చెప్పింది. ఈ ఆంక్షలు, మార్గదర్శకాలు పాటిస్తూ కరోనా కట్టడిలో తమకు సహకరించాలని ప్రభుత్వం కోరింది.