గత వైసీపీ ప్రభుత్వ ఇసుక విధానాలను రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాలను విడుదల చేశారు.

CM Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ 2019, 2021 నాటి ఇసుక విధానాలను రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదలైంది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు కొత్త మార్గదర్శకాలు అమల్లో ఉంటాయి. ఏపీ ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.

వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇసుక తవ్వకాల కోసం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఏపీలోని వివిధ స్టాక్ పాయింట్లల్లో అందుబాటులో ఉంది.

రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డి-సిల్టేషన్ ప్రక్రియ నిర్వహించాలని సర్కారు చెప్పింది. దీనిపై జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయం తీసుకుంటాయి. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలను నిర్ధారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగించారు. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని సర్కారు తెలిపింది.

Also Read: అప్పుడు దాన్ని చంద్రబాబు వినియోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారు?: అంబటి