×
Ad

Sachivalayam Employs: సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..! ప్రభుత్వం కీలక నిర్ణయం..

వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తి చేసి సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.

Sachivalayam Employs: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల కల్పనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పదోన్నతుల కల్పనపై అధ్యయనానికి మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. 10 మంది మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

జీవోఎం కమిటీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి, పయ్యావుల కేశవ్, నారాయణ, సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు, అనిత, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, గుమ్మిడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి పదోన్నతులు ఇచ్చే విభాగాలు, పద్దతులపై అధ్యయనం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

ఇంటర్మిడియరీ పోస్టులు సృష్టిస్తే వాటికి పే స్కేల్ నిర్ణయించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇంటర్మిడియరీ పోస్టుల సృష్టిపై చర్చించాలని మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఆదేశించింది ప్రభుత్వం. ఇతర విభాగాల్లో ఒకే పని స్వభావం కలిగిన ప్రమోషన్ ఛానల్ కల్పించే అంశంపై అధ్యయనం చేయాలంది. పదోన్నతులు ఖరారు చేసేందుకు సంబంధిత విభాగాలకు సూచనలు జారీ చేయాలని ఆదేశాలిచ్చింది.

పదోన్నతుల తర్వాత హేతుబద్దీకరణ నిబంధనల ప్రకారం ఖాళీలు భర్తీ చేసే పద్దతిపై చర్చించాలంది. వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తి చేసి సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.

Also Read: ఆ వీడియో నమ్మేలా లేదు.. వారిని వదలను.. ఏ విచారణకైనా సిద్ధం- కోట వినుత డ్రైవర్ వీడియోపై ఎమ్మెల్యే బొజ్జల హాట్ కామెంట్స్..