కొవిడ్ –19 వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దక్షిణ కొరియా నుంచి టెస్టింగ్ కిట్లు తెప్పించడంతో పాటు జిల్లాల వారీగా తీసుకునే చర్యలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 603 కు చేరింది.
కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 42 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైఎస్సార్ కడప, విశాఖపట్నం జిల్లాలలో 13 మంది చొప్పున, తూర్పు గోదావరి జిల్లాలో 6గురు, కృష్ణా జిల్లాలో 4గురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలలో ఒక్కొక్కరు.. మొత్తం 42 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు. కృష్ణా జిల్లాలో 5గురు, గుంటూరు జిల్లాలో 4గురు, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఇద్దరు చొప్పున చనిపోయారు.
కోవిడ్ –19 నివారణ చర్యలపై సీఎం శ్రీ వైయస్ జగన్ సమీక్షలో ఇలా మాట్లాడారు. ‘రూ.100 కు ఐదు రకాల పండ్ల పంపిణీ బాగుంది. వినూత్న మార్కెటింగ్ విధానాలపై మార్కెటింగ్‌శాఖ అగ్రెసివ్‌గా ముందుకు వెళ్లాలని సీఎం జగన్ అన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడిన అధికారులు ‘శుక్రవారం ఒక్కరోజే ల్యాబ్‌లు, ట్రూ నాట్ మిషన్ల ద్వారా 4వేలకు పైగా పరీక్షలు చేశాం. ర్యాపిడ్ పరికరాలు, స్క్రీనింగ్ కోసం వాడే కొత్త పరికరాల సహాయంతో గణనీయంగా పరీక్షల సామర్థ్యం పెరుగుతుంది. కొవిడ్ పరిస్థితులకు ముందు తిరుపతిలో ఒకటే ల్యాబ్.. ఆ తర్వాత వీటి సంఖ్య 7కు పెంచగలిగాం. వారం రోజుల్లో ల్యాబుల సంఖ్య 12కు పెంచుతామని అధికారులు వెల్లడించారు.
ఇక జిల్లాలలో కోవిడ్–19 నివారణ చర్యలు:
శ్రీకాకుళం జిల్లా:
కరోనా లాక్ డౌన్ కారణంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను, క్వారంటైన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ జె.నివాస్ పరిశీలించారు. సంతబొమ్మాళి కెజిబివిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంతో పాటు ఇతర కేంద్రాలను ఆయన తనిఖీ చేసారు. లాక్ డౌన్ కారణంగా జిల్లాలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాలు, జిల్లాల ప్రజలు ఎవరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా చూస్తామని స్పష్టం చేసారు. జిల్లాలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండరాదని తేల్చి చెప్పారు.
అరబిందో పరిశ్రమ సౌజన్యంతో అక్షయపాత్ర ద్వారా 3 వేల మందికి వివిధ మండలాల్లో ఆహారాన్ని పంపిణీ చేస్తున్నామని, శ్రీకాకుళంలో రెడ్ క్రాస్ ద్వారా దాదాపు 2 వేల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పునరావాస కేంద్రాల్లో పారిశుద్ధ్యం, ఆహార నాణ్యతలో ఎటువంటి తేడాలు ఉండరాదని అధికారులకు స్పష్టం చేసారు. జిల్లాలో 32 పునరావాస కేంద్రాలలో 1776 మంది ఆశ్రయం పొందుతున్నారని కలెక్టర్ చెప్పారు. కరోనా రహిత జిల్లాగా ఉంచాలనే ధ్యేయంతో చర్యలు చేపడుతున్నామని అన్నారు.
ఏప్రిల్ 20 తరువాత కూడా లాక్ డౌన్ ను అమలు చేస్తామని కలెక్టర్ నివాస్ వెల్లడించారు. ప్రజలు లాక్ డౌన్‌కు సిద్ధంగా ఉండాలని, ఎటువంటి మినహాయింపులు ఉండవని అన్నారు. జిల్లాలో లక్ష మందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్న కలెక్టర్, జిల్లాలో ఇప్పటికే ఆ పరీక్షలు ప్రారంభం అయ్యాయని వివరించారు.
విజయనగరం జిల్లా:
జిల్లాలో వెరూ కరోనా బారిన పడకుండా రక్షణ కల్పించే విధంగా ప్రతి వ్యక్తికి ముడేసి మాస్కులు చొప్పున ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. హరిజవహర్‌లాల్ తెలిపారు. జిల్లాకు అవసరమైన 75 లక్షల మాస్కులను స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా తయారు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
మాస్కుల తయారీకి డి.ఆర్.డి.ఏ , మెప్మాల ఆధ్వర్యంలో స్వయం సహాయక సభ్యుల ద్వారా రోజుకు 3 లక్షల మాస్కులను తయారు చేయడానికి సిద్ధం చేయాలన్నారు. మాస్క్ లకు అవసరమైన వస్త్రాన్ని ఆప్కో నుంచి కొనుగోలు చేసి, టైలరింగ్‌లో శిక్షణ పొందిన, కుట్టు మిషన్ కలిగి ఉన్న వారిని, టైలర్స్ అసోసియేషన్ ద్వారా కుట్టించడం జరుగుతోందన్నారు.
ఈ మాస్క్ లను వేడి నీటిలో ఉతికి మరల వినియోగించవచ్చని అన్నారు. ముఖ్యంగా ఉపాధి కూలీలు, వృద్ధులు, పనులపై బయటకు వెళ్లే వారు మాస్క్ తప్పనిసరిగా వాడాలని, అందుకోసమే ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోందని కలెక్టర్ వివరించారు.
పంపిణీ వ్యవస్థ సిద్ధం:
ఈ మాస్కుల పంపిణీకి పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ కమీషనర్లను, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా పరిషత్ సి.ఈ.ఓలను ఇంచార్జ్ అధికారులుగా నియమించారు. మాస్కులన్ని ప్రతి ఇంటికి సచివాలయాల సిబ్బంది ద్వారానే పంపిణీ కావాలన్నారు. ముందుగా హాట్ స్పాట్ ప్రాంతాల్లో పంపిణీ చేయాలన్నారు.
విజయనగరం జిల్లాలో హాట్ స్పాట్ ప్రాంతాలు లేనందున విదేశీయులు, ఢిల్లీ ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుండి వచ్చిన వారికీ, క్వారంటైన్ నుంచి వచ్చిన వారికీ, ఆ తర్వాత తక్కువ ప్రభావం ఉన్న వారికీ మండల ప్రధాన కేంద్రం నుంచి పంచాయతి, హామ్లెట్ వరకు అందరికి పంపిణీ చేసేలా ప్రణాళిక చేసుకోవాలని కలెక్టర్ నిర్దేశించారు.
విశాఖపట్నం జిల్లా:
ఈ నెల 21వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా నాలుగవ విడత ఇంటింటి సర్వే చేపట్టి కోవిడ్ అనుమానిత లక్షణాలు గల వ్యక్తుల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్ట్‌లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఫీల్డ్ సర్వే లెన్స్ , క్లస్టర్ కం ట్న్మెంట్ కమిటీలతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన ఏడు కంటైన్మెంట్ జోన్లలో మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ ఖచ్చితంగా అమలు జరగుతుందన్నారు.
ఆయా ప్రాంతాలలో క్లస్టర్, ఫీల్డ్, ల్యాబ్ కమిటీలు ఇంటింటికి సర్వే చేసి జలుబు, దగ్గు, జ్వరం వంటి అనుమానిత లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి శాంపిల్ కలక్షన్ చేసి టెస్ట్‌లు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. బఫర్ జోన్‌లో పని చేసే శానిటేషన్ సిబ్బందికి కూడా ట్రూనట్ పరీక్ష నిర్వహించాలని చెప్పారు. కంటైన్మెంట్ ఏరియాలో మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేసి కోవిడ్ అనుమానిత లక్షణాల వారికి పరీక్షలను చేయడం జరుగుతుందని కరపత్రాల ద్వారా ప్రచారం చేయాలన్నారు.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో డయాలసిస్, కార్డియాక్, తదితర చికిత్స తీసుకుంటున్న దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు కూడా కోవి డ్ పరీక్షలను నిర్వహించాలన్నారు. నాలుగవ విడత సర్వేలో భాగంగా ఆశ, ఏఎన్‌ఎం, హెల్త్ వర్కర్లు, గ్రామ, వార్డు వాలంటీర్లు ఏ ఇంటిని వదలకుండా సర్వే చేసి శాంపిల్ కలెక్షన్ చేయాలన్నారు.
శాంపిల్ కలెక్షన్ చేసి యాంటీ బాడీ టెస్టింగ్, ట్రూనాట్ పరీక్షలను చేయాలన్నారు. బయట ప్రాంతాల నుండి వలస వస్తున్న కార్మికులను తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉంచి తిరిగి వెళ్లేముందు వారికి ఎటువంటి అనుమానిత లక్షణాలు లేనప్పటికీ ట్రూ నట్ టెస్టులను చేయాలన్నారు . అదేవిధంగా ఎటువంటి షెల్టర్ లేని వారికి ఆహారాన్ని అందించాల నీ, షెల్టర్ ఉండి ఎటువంటి ఉపాధి లేని వారికి వండుకోవడానికి నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలన్నారు.
ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు: వి.విజయసాయిరెడ్డి
కోవిడ్–19 నివారణకు లాడ్ డౌన్ సమయంలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండరాదని వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 21వ వార్డు చినవాల్తేరు, వార్డు వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు, రిసోర్స్ పర్సన్స్, హాస్పిటల్ సిబ్బంది, బూత్ స్థాయి అధికారులకు బియ్యం, బంగాళ దుంపలు, గుడ్లు, ఉల్లిపాయలు, మాస్క్ లు, శానిటెజర్లు, తదితర సరుకులు, వస్తువులను మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు విఎంఆర్డిఎ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావుతో కలిసి ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పేద వారిని ఆదుకునేందుకు దాతలు మరింత మంది ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం సహాయంగా నిత్యవసరాలు, ఖర్చులకు రూ.1000/–లు అందిస్తున్నట్లు తెలిపారు. క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారికి బలమైన ఆహారం తీసుకొనేందుకు రూ.2 వేలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి లాక్ డౌన్‌కు సహకరించాలని శ్రీ విజయసాయిరెడ్డి కోరారు.
కృష్ణా జిల్లా:
కృష్ణా జిల్లాలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా విజయవాడలో ఉన్నందున ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు మంత్రి శ్రీ పేర్ని నాని వెల్లడించారు. జిల్లాలో కరోనా వైరస్ పరిస్థితిని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్‌తో కలిసి ఆయన విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు.
జిల్లాలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో 26 కంటైన్మెంట్ జోన్లు గుర్తించామని, వాటిలో 17 ఒక్క విజయవాడలోనే ఉన్నాయని మంత్రి చెప్పారు. కరోనా నివారణకు ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వలంటీర్లు, ఆశా వర్కర్లు, పీహెచ్‌సీల సర్వేలెన్స్ టీమ్‌లు జిల్లాలో 13,34,913 మంది సమాచారం సేకరించాయని, ఆ సమాచారం ఆధారంగా ఎక్కడికక్కడ తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.
ప్రకాశం జిల్లా:
కరోనా వైరస్ నేపథ్యంలో ఎర్రగొండ పాలెం నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికి రెౌడవ విడత నిత్యావసర సరుకులను యుద్ధప్రాతిపదికన పంపిణీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ఆది మూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ఎర్రగొండ పాలెంలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి క్యాంప్ కార్యాలయం నుండి ఎర్రగొండ పాలెం నియోజకవర్గ పరిధిలోని ఎంపీడీఓ లు,తహశీల్దార్లు తో కరోనా వైరస్, నిత్యావసర సరుకుల పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలు,ఇంటి నివేశ స్థలాల పంపిణీ తదితర అంశాలపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రజల కు ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలని ఆయన అన్నారు. దాతల సహకారంతో ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలని కోరారు. ప్రభుత్వం పేద ప్రజలకు ఇంటి నివేశ స్థలాలు పంపిణీ చేయడానికి పెద్దఎత్తున చర్యలు తీసుకోవడము జరిగిందన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి లే ఔట్లు తయారు చేయాలన్నారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాలను తయారు చేసి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
కరోనా వైరస్ ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి లు, ప్రత్యేక అధికారులకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించే విధంగా చూడాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మాస్క్ లు, శానిటైజర్లు పంపిణీ చేయాలని ఆయన అన్నారు. మండల వారిగా గ్రామానికి ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
చిత్తూరు జిల్లా:
తిరుపతి, తిరుచానూరు సమీపంలోని టీటీడీ పద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన క్వారంటై న్ కేంద్రంలో కరోనా అనుమానితులను మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం పద్మావతి నిలయంను ఆయన తుడా వీసి హరికృష్ణతో కలిసి సందర్శించారు. క్వారంటైన్ కేంద్రం నోడల్ అధికారిణి అయిన తుడా కార్యదర్శి లక్ష్మి అక్కడి సౌకర్యాలను చెవిరెడ్డికి వివరించారు.
ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ అభం శుభం తెలియక ఎక్కడో జరిగిన తప్పుకు బా«ధ్యులై క్వారన్‌టైన్‌లో కరోనా అనుమానితులుగా వచ్చారని తెలిపారు. వీరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కరోనా బాధితులకు స్వామి వారి సంకీర్తనలతో చక్కటి సంగీతం అందించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో మ్యూజిక్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాగా ఈ క్వారన్‌టైన్ కేంద్రంలో 310 కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో వారంతా స్వగృహాలకు వెళ్లారని, ఇంకా 150 మంది కరోనా అనుమానితులు ఉన్నారని నోడల్ అధికారిణి లక్ష్మి తెలిపారు.
అనంతపురం జిల్లా:
జిల్లా వ్యాప్తంగా పాజిటివ్ వచ్చిన కేసులకు సంబంధించి కాంటాక్ట్ ట్రేసింగ్ లోతుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని ఎన్‌ఐసి భవనం నుంచి కోవిడ్ 19 పాజిటివ్ వ్యక్తులకు సంబంధించి కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారం టైన్ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు సంబంధించి ఒక్కరు కూడా మిస్ కాకుండా పక్కాగా కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించాలని, కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు కనబడిన రోజు నుంచి ముందు 7 రోజుల వరకు అన్ని రకాల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లను గుర్తించాలని ఆదేశించారు.
ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ట్రేసింగ్లో ఒక్కరు మిస్ అయినా కరోనా వైరస్ మరింత వ్యాపించే అవకాశం ఉంటుందని, వైరస్ నివారణకు పక్కాగా ట్రేసింగ్ చేయాలన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రొఫార్మా లో అన్ని వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాజిటివ్ గా నిర్ధారణ అయిన 12 గంటల లోపు వారికి సంబంధించి డ్రెస్సింగ్ మొత్తం పూర్తి చేయాలని సూచించారు.
జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్, మెడికల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రతి ఒక్కరి కాంటాక్ట్‌ను ట్రేస్ చేయాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు శాంపుల్ కలెక్షన్, టెస్టింగ్, క్వారంటైన్ ఏర్పాటును వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్ వచ్చినవారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ల వివరాలను ఎంతవరకు సేకరించారు అన్న వివరాలను కలెక్టర్ ఆరా తీశారు.
కర్నూలు జిల్లా:
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైనందు వల్ల ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు డోర్ డెలివరీ చేయడానికి టోకు, చిల్లర వ్యాపారులు ముందుకు రావాలని కలెక్టర్ జి.వీరపాండియన్ కోరారు. రీటైల్ డీలర్లతో సమావేశమైన ఆయన, ప్రజలకు అవసరమైన సరుకుల డోర్ డెలివరీకి ప్రత్యేకంగా అనుమతి ఇస్తామని చెప్పారు. ఉదయం వేళ ఆర్డర్ తీసుకుని, సరుకులు ప్యాక్ చేయాలని.. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి వాటిని డెలివరీ చేయాలని సూచించారు. రూ.500 కంటే తక్కువ విలువైన సరుకుల ఆర్డర్లను స్వయం సహాయక బృందాల సేకరించి, వ్యాపారులకు అందజేస్తామని తెలిపారు.