విశాఖజిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ పై దాడికి సంబంధించిన కేసును హైకోర్టు సీబీఐకు బదలాయించింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐను ఆదేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో తెలిపింది.
సుధాకర్ శరీరంపై గాయాలున్న విషయం మేజిస్ట్రేట్ నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల ఊసే లేదని ధర్మాసనం పేర్కొంది. దాడి ఘటనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చే నివేదికపై తమకు నమ్మకం లేదని… అందుకే ఈ ఘటనపై సమగ్ర విచారణ కోసం కేసును సీబీఐ కి అప్పగిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఏపీ లోని విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన ప్రభుత్వ వైద్యుడు సుధాకర్ గత మార్చి, ఏప్రిల్ నెలల్లో కరోనా రోగులకు వైద్య సేవలు అందించారు. అయితే, ఆ సందర్భంగా వైద్యులకు అందించే పీపీఈ కిట్లు, మాస్క్ ల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
వైద్యులకు సరిపడా పీపీఈ కిట్లను సమకూర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఈ నేపధ్యంలో గత శనివారం మే 16న డాక్టర్ సుధాకర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సుధాకర్ మానసిక స్థతి సరిగ్గా లేదని కేజీహెచ్ వైద్యులు చెప్పడంతో మెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు.. శుక్రవారం విచారణ జరిపి తాజా ఆదేశాలు జారీ చేసింది.
Read:ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 62మందికి కొవిడ్, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి