Group1 Exams : గ్రూప్‌-1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే

గ్రూప్‌-1 ఇంటర్వ్యూలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఇంటర్వ్యూ ప్రక్ర్రియను 4 వారాలపాటు నిలిపివేయాలని ఆదేశించింది. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ 9 పిటిషన్లు దాఖలయ్యాయి.

Group1 Exams : గ్రూప్‌-1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే

Group1 Exams

Updated On : June 16, 2021 / 5:52 PM IST

Group1 Exams : గ్రూప్‌-1 ఇంటర్వ్యూలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఇంటర్వ్యూ ప్రక్ర్రియను 4 వారాలపాటు నిలిపివేయాలని ఆదేశించింది. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ 9 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం రేపటి(జూన్ 17,2021) నుంచి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాలతో ఇంటర్వ్యూ ప్రక్రియ వాయిదా పడింది.

ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో నిన్న(జూన్ 15,2021) సుదీర్ఘ వాదనలు జరిగాయి. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. డిజిటల్‌ వాల్యూవేషన్‌ గురించి చివరి దశలో తెలిపారని కోర్టుకి చెప్పారు. తెలుగు మీడియం పేపర్లను రాష్ట్రంలోనూ, ఇంగ్లీష్ మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లోనూ వాల్యూవేషన్‌ చేశారని, దీంతో ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం… ప్రైవేటు వ్యక్తులతో వాల్యూవేషన్‌ ఎలా చేయిస్తుందని వాదించారు. పీపీఎస్సీ ఛైర్మన్‌ను పక్కన పెట్టి కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించారని వాదించారు. ఇంటర్వ్యూలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

నిబంధనల ప్రకారమే గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాల్యూషన్‌ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం నిన్న తీర్పును రిజర్వులో ఉంచింది. గ్రూప్‌-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో గ్రూప్‌ -1 ఇంటర్వ్యూలను నాలుగు వారాలపాటు వాయిదా వేసిన ఏపీపీఎస్సీ.. ఇంటర్వ్యూల తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామంది.