YSRCP MLCs: మండలిలో మెజార్టీ ఉండటంతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్సీలు ఝలక్ ఇస్తున్నారు. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. పోతుల సునీత మినహా మిగతా ముగ్గురు టీడీపీలో చేరారు.
పోతుల సునీత బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసిన సభ్యులు టీడీపీ కండవా కప్పుకోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. 13 నెలల నుంచి కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి రాజీనామాలు చైర్మన్ ఆమోదించడం లేదు. అలాగే ఆరు నెలల క్రితం రిజైన్ చేసిన మర్రి రాజశేఖర్ రాజీనామాను కూడా ఆమోదించ లేదు. ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ రాజీనామాలపై ఛైర్మన్ తన నిర్ణయాన్ని ప్రకటించడం లేదంటున్నారు జంపింగ్ ఎమ్మెల్సీలు.
వీళ్లు ముగ్గురు ప్రొసీజర్ ప్రకారమే రాజీనామా చేసి డైరెక్ట్‌గా ఛైర్మన్‌కు రిసిగ్నేషన్ లెటర్స్‌ను అందజేశారు. తమ రాజీనామాలను ఆమోదించాలంటూ గతంలో ఈ ముగ్గురు సభలోనే నిరసన తెలిపారు. అప్పటినుంచి వీరు టీడీపీకి టచ్‌లోనే ఉన్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే జయ మంగళ వెంకటరమణ, మండలి డిప్యూటీ చైర్మన్ జకియాఖానమ్ రాజీనామాలు కూడా చైర్మన్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి.
Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపెవరిది? సెఫాలజిస్ట్ సైదులు చేసిన కాంగ్రెస్ సర్వేలో ఏం తేలింది?
వీళ్లు కూడా వైసీపీలో ఇమడ లేక రాజీనామాలు చేస్తున్నామంటూ ప్రకటించారు. జకియాఖానమ్ బీజేపీలో చేరగా.. జయమంగళం వెంకటరమణ జనసేనలో చేరారు. జయమంగళ వెంకటరమణ అయితే తన రాజీనామా ఆమోదం కోసం కోర్టుకెళ్లారు. హైకోర్టు నుంచి మండలి ఛైర్మన్‌కు నోటీసులు కూడా వచ్చాయి. ఇప్పటివరకు ఆరుగురు సభ్యులు వైసీపీకి దూరమయ్యారు. త్వరలోనే మరికొందరు సభ్యులు కూడా ఇదే బాటలో వైసీపీని వీడి వెళ్తాతారని ప్రచారం జరుగుతోంది. (YSRCP MLCs)
ఎవరి ఒత్తిడితో తమ రాజీనామాలు ఆమోదించడం లేదంటూ మండలి ఛైర్మన్‌ను టార్గెట్ చేస్తున్నారు ఎమ్మెల్సీలు. శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. అందులో గవర్నర్ కోటా కలుపుకుని వైసీపీ సభ్యులు 35. టీడీపీకి 10 మంది, జనసేనకు ఇద్దరు, బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. పలువురు ఇండిపెండెంట్లు ఉన్నారు. వైసీపీ బలంగా 35 మంది ఉండగా ఆరుగురు రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య 29కి పడిపోయినట్లు అయింది.
అయితే మండలి ఛైర్మన్ మోషెన్ రాజు తీరుపై కూటమి అసంతృప్తిగా ఉంది. ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించకపోవడంతో.. ఆయనపై అవిశ్వాసానికి పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు చేత రాజీనామా చేయించి..వారిని టీడీపీలో చేర్చుకునే ప్లాన్ నడుస్తోందట. రాజీనామా చేసిన సభ్యులు పోను..మిగిలిన ఎమ్మెల్సీలతో మోషెన్ రాజు మీద అవిశ్వాస అస్త్రం ప్రయోగిస్తే తామే గెలిచే అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట.
అయితే ఇప్పటివరకు వైసీపీని వీడిన.. ఆరుగురు ఎమ్మెల్సీల రాజీనామాల విషయంలో మండలి ఛైర్మన్ ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. వైసీపీ ఒత్తిడి వల్లే తమ రాజీనామాలను ఛైర్మన్ ఆమోదించడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు జంపింగ్ ఎమ్మెల్సీలు. తాము అధికారికంగా టీడీపీలో చేరాం కాబట్టి ఫిరాయింపు నిరోధక చట్టం కింద వైసీపీ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తుందో లేదో ఎదురుచూస్తామంటున్నారు సభ్యులు.
అధికారికంగా పార్టీలు మారిన ఎమ్మెల్సీలు అంతా సోమవారం శాసనమండలికి హాజరయ్యేందుకు రెడీ అవుతున్నారు. టీడీపీ కండువాలతో ఆ నలుగురు, బీజేపీ, జనసేన కండువాతో మరో ఇద్దరు మండలికి హాజరైతే వైసీపీ ఎలా స్పందిస్తుందో..? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు మాత్రం ఛైర్మన్ తన నిర్ణయం ప్రకటించని తప్పని పరిస్థితి కల్పించాలనే భావనలో ఉన్నారు.