అసలు ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అరెస్టులు, విచారణలు, కస్టడీలు..ఇవన్నీ ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయినట్లే. కానీ కీలక దశలో ఉన్న లిక్కర్ కేసులో నిందితులకు బెయిల్ రాకుండా అడ్డుకోవడమే సిట్ ముందున్న ప్రధాన లక్ష్యం. అందుకోసం కోర్టులో సబ్‌మిట్ చేసేందుకు పకడ్బందీగా ఆధారాలు సేకరిస్తోందట సిట్. ముడుపుల వ్యవహారం ఏంటి..ఎవరెవరికి లింకులు ఉన్నాయి..ఏ నెంబర్ కార్లు వాడారు..ఫోన్ సంభాషణలు ఏంటి..ఇలా ప్రతీ ఒక్కటి పక్కా స్కెచ్ ప్రకారం జరిగిందని ప్రూవ్ చేసేందుకు తీవ్ర కసరత్తే చేస్తోందట సిట్ టీమ్. లేటెస్ట్ టెక్నాలజీతో మద్యం ముడుపుల వీడియోలను సేకరించినట్లు తెలుస్తోంది.
డెన్లలో దాచిన డబ్బులు, వాటిని నిందితులు సెల్‌ఫోన్లలో షూట్ చేసిన వీడియోలు దొరికినట్లు చెబుతున్నారు. నిందితుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్ల నుంచి ఈ వీడియోలను స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. ఎన్నికల తర్వాత నిందితులు ముందు జాగ్రత్తగా తమ సెల్‌ఫోన్ల నుంచి ఆ వీడియోలను డిలీట్ చేశారట. అధికారులు ఆ సెల్‌ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపి డిలీట్ చేసిన వీడియోలను రిట్రీవ్ చేశారని చెప్పుకుంటున్నారు.
Also Read: మంత్రికి ఆ నియోజకవర్గంలోకి నో ఎంట్రీ..! అడుగుపెట్టనివ్వబోమని ఎమ్మెల్యే వర్గం పట్టు
మద్యం డీలర్ల నుంచి ముడుపులు వసూలు చేశాక పెద్దలకు చేరవేసేవరకు..అంతా లిక్కర్ స్కామ్‌లో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి డైరెక్షన్‌లో జరిగిందట. నిందితులు లిక్కర్ సొమ్ము పంపిణీకి ముందు వీడియోలు తీశారని అంటున్నారు. డెన్లలో దాచిన డబ్బుల వివరాలను సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి పెట్టుకున్నారట. ఎన్నికల తర్వాత అలర్ట్ అయిన రాజ్ కసిరెడ్డి తాను ఏర్పాటు చేసుకున్న వసూళ్ల నెట్‌వర్క్‌లోని ప్రతి వ్యక్తినీ హైదరాబాద్‌కు పిలిపించి వారి సెల్‌ఫోన్లు తీసుకున్నాడని విచారణలో తేలిందంటున్నారు.
ప్రతి ఫోన్‌కూ కనీసం లక్ష రూపాయలకు తగ్గకుండా ఇచ్చి కొత్త ఫోన్ తీసుకోవాలని సూచించాడట. ఇక లిక్కర్ ఆర్డర్లు పెట్టిన కంప్యూటర్లను డిపోల్లో ధ్వంసం చేశారట. అయినా కొన్ని వీడియో ఫుటేజ్‌లతో పాటు చాటింగ్‌లు, ఫొటోలు బయటపడ్డట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు త్వరలో దాఖలు చేయనున్న చార్జిషీట్‌లో ఈ ఆధారాలను పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.
ఓ స్కెచ్ ప్రకారం దోపిడీ
లిక్కర్ కేసులో ఓ స్కెచ్ ప్రకారం దోపిడీ జరిగిందని విచారణలో తేలిందంటున్నారు. సిట్ ఇప్పటి వరకూ 40 మందిని నిందితులుగా చేర్చింది. రాజ్ కసిరెడ్దితో పాటు మాజీ సీఎం జగన్ సెక్రటరీ ధనుంజయ్ రెడ్డి, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు తొమ్మిది మందిని అరెస్టు చేసింది. సాక్షులు, అనుమానితులను 200మందికి పైగా విచారించింది. ఈ కేసులో భాగస్వామ్యం ఉన్న పది మందికిపైగా విదేశాలకు పారిపోయారు. ఈ కేసు విచారణలో మూడు నెలలకు పైగా సిట్ సేకరించిన ఆధారాలు ఈ నెల 17న విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరనున్నాయి.
మద్యం ముడుపుల వసూళ్లు, డెన్‌లలో దాచడం, కీలక వ్యక్తులకు పంపడం, ఎన్నికల్లో అభ్యర్థులకు పంపిణీ చేయడం, కీలక వ్యక్తుల పాత్ర, బినామీల ఆస్తులు, హవాలా మార్గంలో విదేశాలకు తరలించడం వంటివి చార్జిషీట్‌లో మెన్షన్ చేసే అవకాశం ఉందంటున్నారు. పది రోజులకు పైగా ఇదే పనిలో బిజీగా ఉన్న సిట్ అధికారులు లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో చర్చిస్తున్నారట. సూత్రధారులెవరు, పాత్రధారులెవరనే దానిపై టెక్నికల్ ఎవిడెన్స్‌తో పక్కా ఆధారాలను సేకరించి కోర్టులో చార్జిషీట్ వేయబోతున్నారట.
ఎక్సైజ్ అధికారులు, గత ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నేతల పాత్రపై కూడా ఇప్పటివరకు తాము కలెక్ట్ చేసి అన్ని ఎవిడెన్స్‌ను సిట్ కోర్టుకు సబ్‌మిట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21 నాటికి రిమాండ్ ఖైదీగా రాజ్ కసిరెడ్డి జ్యుడీషియల్ కస్టడీ 90 రోజులు పూర్తి అవుతుంది. ఈ లోపు చార్జిషీట్ వేయకపోతే డిఫాల్ట్‌గా బెయిల్ వస్తుంది. దీంతో ప్రధాన నిందితుడిగా అలిగేషన్స్ ఫేస్ చేస్తున్న రాజ్‌కసిరెడ్డి బయటికి వస్తే..కేసు మొత్తం తారుమారైపోతుందని సిట్ భావిస్తోందట. అందుకే చాలా పకడ్బందీగా..లీగల్ ఎక్స్ట్‌పర్ట్స్ ఒపీనియన్‌తో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
ఓ వైపు విజయసాయిరెడ్డి సిట్ విచారణ బాకీ ఉంది. ఇప్పటికే ఆయన ఓ సారి సిట్ ముందుకెళ్లి..ఇన్ అండ్ ఔట్ అంతా చెప్పేసి..అందరినీ ఇరకాటంలో పెట్టేశారు. ఇప్పుడు మరోసారి ఆయన సాక్షిగా సిట్ ముందు హాజరుకాబోతున్నారు. ఈసారి విజయసాయి ఏం చెప్తారనే టెన్షన్ ఓ వైపు కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఛార్జిసీట్ అంశం ఇంకా ఉత్కంఠ రేపుతోంది. రాజ్‌కసిరెడ్డికి బెయిల్ రావడం..రాకపోవడం పక్కన పెడితే..ఆయనతో ఎవరికి లింకులు ఉన్నాయని సిట్ ఆరోపిస్తుందో..ఎలాంటి ఆధారాలను బయటపెడుతుందోనన్న ఆందోళన అయితే ఫ్యాన్ పార్టీ పెద్దల్లో కనిపిస్తుందంటున్నారు. కీలకంగా మారిన విజయసాయి విచారణ..సిట్ ఛార్జిషీట్ తర్వాత ఏం జరగబోతోందో చూడాలి మరి.