మంత్రికి ఆ నియోజకవర్గంలోకి నో ఎంట్రీ..! అడుగుపెట్టనివ్వబోమని ఎమ్మెల్యే వర్గం పట్టు

మంత్రి అయినప్పటి నుంచి బెల్లంపల్లికి కూడా వెళ్లలేదు వివేక్. మంచిర్యాలకు ఎలాగూ దూరంగానే ఉంటున్నారు.

మంత్రికి ఆ నియోజకవర్గంలోకి నో ఎంట్రీ..! అడుగుపెట్టనివ్వబోమని ఎమ్మెల్యే వర్గం పట్టు

Vivek Venkataswamy

Updated On : July 14, 2025 / 8:43 PM IST

చెన్నూరు ఎమ్మెల్యే, మంత్రి వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావుమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏ పార్టీలో ఉన్నా ఈ ఇద్దరికి అస్సలే గిట్టదు. పైగా వివేక్ కాంగ్రెస్‌లో చేరికను కూడా ప్రేమ్‌సాగర్‌రావు వ్యతిరేకించారు. ఎన్నికల హడావుడిలో వివేక్‌ చేరిక..చెన్నూరు నుంచి పోటీ చేసి గెలవడం అంతా జరిగిపోయాయి. అయితే ఎంపీ ఎన్నికల్లో తన కొడుకు వంశీకి పెద్దపల్లి టికెట్ తెచ్చుకున్న వివేక్..ప్రేమ్‌సాగర్‌రావుకు ఓ మాట ఇచ్చారట. తన కొడుకు వంశీ గెలుపునకు సహకరిస్తే ప్రేమ్‌సాగర్‌రావుకు మంత్రి పదవి విషయంలో అడ్డురానని హామీ ఇచ్చారట.

తీరా మొన్నటి విస్తరణలో తనకు రావాల్సిన క్యాబినెట్‌ బెర్తును వివేక్‌ ఎత్తుకెళ్లారని మండిపడుతున్నారట ప్రేమ్‌సాగర్‌ రావు. ఈ క్రమంలోనే నేపథ్యంలోనే ప్రేమ్‌సాగర్ రావు, ఆయన అనుచరవర్గం..తమ నియోజకవర్గంలో అడ్డుపెట్టొద్దని ఏకంగా మంత్రి వివేక్‌కు అల్టిమేటం జారీ చేశారట. తన ఇలాఖకు తానే రాజునని, తానే మంత్రినని ప్రకటించారు. సీఎం మినహా తనకెవరు బాస్‌లు లేరని బహిరంగంగా ప్రకటించారు ప్రేమ్‌సాగర్‌రావు. ఎవరైన తన ఏరియాలో పెత్తనం చలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పేశారు. ఒకవేళ మంత్రి వివేక్ మంచిర్యాల వస్తే గొడవలు తప్పవని, ఆయనను మంచిర్యాల అడుగుపెట్టనీయమని ప్రతిజ్ఞ చేశారు ప్రేమ్ సాగర్ రావు.

Also Read: కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత చేరేందుకు రంగం సిద్ధం.. అందుకే ఇలా..: తీన్మార్ మల్లన్న

వివేక్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా నిలదీశారట ప్రేమ్‌సాగర్‌రావు. కష్టపడ్డది తామైతే ఫలితం దక్కింది మరొకరికా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. వేరే పదవి ఇస్తామని అధిష్టానం ఆఫర్ చేసిన తిరస్కరించారట. తనకు మంత్రి పదవి తప్ప వేరే ఏం వద్దంటూ అక్కడి నుంచి వచ్చేశారట ప్రేమ్‌సాగర్‌రావు. కాంగ్రెస్ తమ నేతకు అన్యాయం చేసిందని ఆగ్రహంతో ఉన్న ప్రేమ్‌సాగర్ రావు అనుచరులు..తమ నేతకు దక్కాల్సిన మంత్రి పదవిని తన్నుకుపోయిన గడ్డం వివేక్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట.

దీంతో ఎందుకైనా మంచిదని మంత్రి వివేక్ కూడా ఆ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. మంచిర్యాలలో అడుగుపెట్టకుండా జాగ్రత్త పడుతున్నారట. మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఇందారం మీదుగా చెన్నూరు నుంచి అటు వైపుగా మందమర్రి వెళ్లిన మంత్రి మంచిర్యాలలో మాత్రం అడుగుపెట్టలేదు. ప్రేమ్‌సాగర్ రావు, ఆయన అనుచరుల హెచ్చరికలతోనే వివేక్ మంచిర్యాల నియోజకవర్గం రావడం లేదన్న చర్చ జరుగుతుంది.

నియోజకవర్గానికి నలుగురు మంత్రులు
ఈ మధ్యే మంచిర్యాల నియోజకవర్గానికి నలుగురు మంత్రులు వచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహలు పలు అభివృద్ధి పనులతో పాటు బహిరంగ సభకు హజరయ్యారు. అయితే స్థానికంగా ఉమ్మడి జిల్లాలోనే ఉంటున్న మంత్రి వివేక్ వెంటస్వామి మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆయన ఆదిలాబాద్ జిల్లాలో జరిగే కార్యక్రమంలో పాల్గొన్నారు కానీ..తన సొంత జిల్లాలో ఇంతపెద్ద కార్యక్రమానికి కూడా మంత్రి వివేక్ హాజరుకాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే వివేక్‌ను తన ఇలాఖలోకి రానివ్వనని చెప్పిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు తన పంతం నెగ్గించుకుంటున్నారు. మంత్రుల ప్రోగ్రామ్స్ జరిగే ప్రాంతం మీదుగా వివేక్ వెంకటస్వామి ఆదిలాబాద్ వెళ్లినప్పటికీ..అక్కడ ఆగే సాహసం కూడా చేయడం లేదంటే ప్రేమ్‌సాగర్‌రావు వర్గం ఎంత కోపంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన పంథా నెగ్గించుకున్నట్టుగానే భావించవచ్చు.

మంచిర్యాల జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే..అందులో ఒకటి వివేక్ నియోజకవర్గం చెన్నూరు. మరొకటి బెల్లంపల్లి. అక్కడి వివేక్ సోదరుడు వినోద్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రి అయినప్పటి నుంచి బెల్లంపల్లికి కూడా వెళ్లలేదు వివేక్. మంచిర్యాలకు ఎలాగూ దూరంగానే ఉంటున్నారు. దీంతో చెన్నూరుకే ఎమ్మెల్యే..తన అసెంబ్లీ నియోజకవర్గానికే మంత్రి అన్నట్లు అయిపోయింది వివేక్ పరిస్థితి. రాబోయే రోజుల్లో అయినా మంత్రిగా వివేక్ మంచిర్యాల నియోజకవర్గంలో అడుగుపెడతారా..? ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటారా..? అనేది వేచి చూడాల్సిందే.