local body elections
AP local body elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ నెలలో లేదా వచ్చే నెలలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. మరోవైపు ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా మోగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు ఏర్పాట్లు చేస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకుంది. వీటి నుంచి మున్సిపల్, పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం మున్సిపల్, పంచాయతీల్లో మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలన్న యోచనతో ఎన్నికల సంఘం ఉంది.
వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీలో 2021 ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. దీంతో గ్రామ పంచాయతీల పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. మున్సిపల్ ఎన్నికల గడువు వచ్చే ఏడాది మార్చి 17వ తేదీతో ముగియనుంది. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల గడువు సెప్టెంబర్ 3, 4 తేదీల్లో ముగియనుంది. పంచాయతీల విలీనానికి సంబంధించిన క్లియరెన్స్ ఈ నెలాఖరుకు వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద 1.20వేల బ్యాలెట్ బాక్స్ లు ఉన్నాయి. అదనంగా మరో లక్ష బ్యాలెట్ బాక్సులు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే ఆలోచనలో ఎస్ఈసీ ఉంది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణకోసం పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ నుండి అదనపు సిబ్బందిని ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరనుంది.
ఇదిలాఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధత లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖలపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఇంకా సమాధానం రాలేదు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనల ప్రకారం.. డిసెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తికి నెలన్నర సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
పంచాయతీ, మున్సిపల్ ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగిశాకే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలాఖరుకు రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తిచేస్తే.. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.