ఏపీ మెగా డీఎస్సీ.. ఎందులో ఎన్ని పోస్టులు అంటే..?

కొన్నేళ్లుగా డీఎస్సీ లేక ఉపాధ్యాయ నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు.

AP Mega Dsc : ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ఈ డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు? ఏ కేటగిరిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? వాటి వివరాలు విడుదల చేశారు.

ఈ డీఎస్సీ ద్వారా ఏపీ వ్యాప్తంగా 16వేల 347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. సీఎం చంద్రబాబు సంతకంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలు కానుంది. ఎస్జీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్లు, పీజీటీ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టనున్నారు.

ఇక ఏ కేటగిరిలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాల్లోకి వెళితే.. ఇందులో స్కూల్ అసిస్టెంట్ – 7,725.. ఎస్జీటీ – 6,371.. టీజీటీ – 1,781.. పీజీటీ – 286, ప్రిన్సిపల్స్ – 52, పీఈటీ – 132 పోస్టులు ఉన్నాయి.

కొన్నేళ్లుగా డీఎస్సీ లేక ఉపాధ్యాయ నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు. జీవో 117ను రద్దు చేస్తే మరిన్ని ఉపాధ్యాయ ఖాళీలు వస్తాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 6వేల 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ, ఎన్నికల కోడ్ నేపథ్యంలో భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది. పాఠశాలల విలీనానికి ముందు ఏపీలో 36వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదికలు ఇచ్చారు అధికారులు. కానీ, పాఠశాలల విలీనం తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు.

ఇక, మెగా డీఎస్సీకి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేయనుంది. అలాగే, పరీక్ష తేదీలు విడుదల చేయనుంది.

Also Read : కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు.. పౌరవిమానయాన శాఖ గురించి కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు