Kodali Nani
Kodali Nani : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీ ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా జనసేనాని పవన్ కళ్యాణ్ దీక్ష కూడా చేశారు. అంతేకాదు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ప్రాణత్యాగాలు చేసైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ నేతలు చెప్పారని, వారు అంత త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని, పార్లమెంటులో కనీసం ప్లకార్డులు పట్టుకుంటే చాలని పవన్ చురకలు అంటించారు.
పవన్ వ్యాఖ్యలపై ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఘాటుగా బదులిచ్చారు. పవన్ సలహాలు తమకు అవసరం లేదన్నారు. స్టీల్ ప్లాంట్ అంశంలో ఏం చేయాలో చెప్పడానికి పవన్ ఏమీ తమ వ్యూహకర్త కాదని ఎద్దేవా చేశారు. తమకు వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ఉన్నారని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ ఆ సలహాలేవో దత్తత తండ్రి చంద్రబాబుకో, లేక బీజేపీకో ఇచ్చుకోవాలని సూచించారు.
Credit Debit Cards : క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. జనవరి నుంచి కొత్త రూల్స్
స్టీల్ ప్లాంట్ విషయంలో తాము చేసేది చేస్తామని, అసలు పవన్ ఏం చేస్తాడో చెప్పాలని కొడాలి నాని నిలదీశారు. అయినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాల్సిన బాధ్యత కేంద్రానిదని, పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తే ప్రైవేటీకరణ ఆగిపోతుందా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ను రాజకీయ అజ్ఞానితో పోల్చిన మంత్రి.. ఆయనిచ్చే సలహాలు ఎవరికి కావాలన్నారు.
సీఎం జగన్ పుట్టిన రోజుని పురస్కరించుకుని రాష్ట్రంలో ‘వన్ టైం సెటిల్‌మెంట్ స్కీం’ (ఓటీఎస్)ను అమలు చేస్తున్నామని మంత్రి కొడాలి నాని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ నుంచి రుణం తీసుకొని ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా హక్కు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. హక్కు లేక రూ.15-20 లక్షల విలువైన ఇళ్లను 2-3 లక్షలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నుంచి ఓటీఎస్ ద్వారా సీఎం తప్పిస్తున్నారని వెల్లడించారు.
Mustard Oil : ఆవ నూనెతో వంట…బరువు తగ్గటం సులువు
ఎంత రుణం ఉన్నా ఓటీఎస్ ద్వారా రూపాయి తీసుకోకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయిస్తోందని చెప్పారు. తద్వారా వారికి పూర్తి హక్కులు కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇలాంటి మంచి పథకాన్ని కొందరు పనిగట్టుకొని విమర్శిస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. పేదలను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 5 లక్షల మంది పేదలకు లబ్ధి కలిగించే ఈ పథకం సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ప్రారంభిస్తామన్నారు.