నవంబరు1 నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్లు

నవంబరు1 నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్లు

Updated On : October 14, 2019 / 1:52 AM IST

ఏపీలో నవంబరు ఒకటో తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సంబంధిత ఆస్తుల క్రయవిక్రయదారులే పత్రాలు తయారుచేసుకుని ఆన్ లైన్లోనే రిజిస్ట్రేషన్ రుసుములు చెల్లించేలా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే విశాఖపట్నం, కృష్ణాజిల్లాలోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేశారు. 

మధ్యవర్తులు, డాక్యుమెంట్ రైటర్లు అవసరం లేకుండా అమ్మకాలు, కొనుగోళ్లు నిర్వహించడం ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్లను ఏ కారణంతో తిరస్కరించినా దరఖాస్తుదారు అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది. ఏ కారణాలతో డాక్యుమెంట్‌ను తిరస్కరించారో సంబంధిత అధికారి నిర్ణీత వ్యవధిలో వివరణ ఇవ్వాలి. 

* ఆస్తుల అమ్మకకొనుగోళ్లు జరిపేవారి వివరాలు నమోదు చేసుకునేలా వివిధ అవసరాలకు తగిన 16 నమూనా డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారు. 
* తెలుగు, ఆంగ్ల భాషల్లో వీటిని అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నమూనాపత్రంలో ఉన్న వివరాలే కాకుండా అదనపు వివరాలు కూడా ఆన్‌లైన్లోనే నమోదు చేసుకోవాలి. 
* ఈ ప్రక్రియ ముగియగానే ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తుదారునికి టైం స్లాట్ కేటాయిస్తారు. ఆ సమయానికి దరఖాస్తుదారులు డాక్యుమెంట్లు ప్రింట్ తీసుకుని కార్యాలయానికి వెళ్తే స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహిస్తారు.