Ap Raj Bhavan High Alert : ఏపీ గవర్నర్ వద్ద రెండు కీలక అంశాలు

  • Publish Date - July 20, 2020 / 11:03 AM IST

అందరి చూపు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ వైపు నెలకొంది. ఎందుకంటే ఆయన వద్ద రెండు కీలక అంశాలున్నాయి. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ఏపీ ప్రభుత్వం పంపిన సంగతి తెలిసిందే. దీనిని గవర్నర్ యథాతథంగా ఆమోదిస్తారా..? న్యాయ సలహా కోరతారా..? గవర్నర్‌ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మొదటి అంశం : –
అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల భవిష్యత్‌పై ఉత్కంఠ నెలకొంది. బిల్లులు రెండూ ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వాటిన్ ఆయన యథాతథంగా ఆమోదిస్తారా? సందేహాలుంటే నివృత్తి కోసం తిప్పి పంపుతారా…? లేక న్యాయనిపుణుల సలహా కోరతారా…? అధ్యయనానికి సమయం తీసుకుంటారా…? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.

మంత్రిమండలి సిఫార్సు చేయడం, అసెంబ్లీలో ఆమోదించినందున ఈ బిల్లులపై గవర్నర్‌ ఆమోదముద్ర వెంటనే పడుతుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున త్వరగా ఆమోదించే పరిస్థితి లేదని విపక్షాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లులపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

ఇక రెండో అంశం : –
ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ 2020, జులై 20వ తేదీ సోమవారం గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. ఆయనను తిరిగి పదవిలో నియమించే విషయంలో గవర్నర్‌ను కలవాలని కోర్టు సూచించడంతో… ఆయన అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. సోమవారం ఉదయం 11.30 నిమిషాలకు రమేశ్‌కుమార్‌కు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.

అయితే… రమేశ్‌కుమార్‌ విషయంలో గవర్నర్‌ ఎలా వ్యవహరించబోతున్నారు? అన్న విషయమై అధికార వర్గాల్లో ఆసక్తి ఏర్పడింది. హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ను నియమించవలసి ఉన్నా… గవర్నర్‌ ఈ దిశగా చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి ఏమిటి? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే… వివాదం హైకోర్టు పరిశీలనలో ఉంది కాబట్టి గవర్నర్‌ తీసుకోబోయే చర్యపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు