Operation Nepal : నేపాల్ నుంచి సురక్షితంగా ఏపీకి వచ్చిన తెలుగు వారు.. వామ్మో.. కర్రలు, రాడ్లతో బస్సు ధ్వంసం.. హోటల్‌కు నిప్పు..

Operation Nepal : ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులు సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్నారు.

Operation Nepal : నేపాల్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా Gen Z యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారు భయాందోళనకు గురయ్యారు. అయితే, నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షణలో నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు.

Also Read: Nepal Flash Back: ఫ్యామిలీ మొత్తాన్ని కాల్చి చంపిన నేపాల్ రాజు స్టోరీ.. అప్పుడు ఏం జరిగింది?

ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది నేపాల్ రాజధాని ఖాట్మండు విమానాశ్రయం నుంచి విశాఖపట్టణం చేరుకున్నారు. వీరిలో ఉత్తరాంధ్రకు చెందిన వారు 104 మంది కాగా.. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన 40 మంది ఉన్నారు. వారిని ప్రత్యేక విమానం ద్వారా విశాఖ నుంచి తిరుపతికి తీసుకెళ్లారు. విశాఖ విమానాశ్రయంలో ఏపీ వాసులకు ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు, కలెక్టర్ అధికారులు స్వాగతం పలికారు. తిరుపతి చేరుకున్న తెలుగువారికి కూటమి ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనాల్లో వారు తమ స్వస్థలాలకు వెళ్లారు.


నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రెండ్రోజులుగా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షించారు. నేపాల్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు చేరుకున్న ప్రయాణికులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తాము తిరిగి విశాఖ చేరుకోవడానికి కృషి చేసిన మంత్రి నారా లోకేశ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నేపాల్ నుంచి తిరిగివచ్చిన యాత్రకులు అక్కడ వారు ఎదుర్కొన్న అనుభవాన్ని పంచుకున్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. మేము సురక్షితంగా విశాఖ వస్తామని అనుకోలేదని, ఏపీ ప్రభుత్వం చొరవతో బయటపడ్డామని అన్నారు. నేపాల్ లో మేం ఉంటున్న హోటల్ కు నిప్పు పెట్టారు. మా లగేజ్ అంతా హోటల్ లోనే ఉంది. కట్టుబట్టలతో తప్పించుకున్నామని చెప్పారు. దారిలో మేం ప్రయాణిస్తున్న బస్సుపై కూడా దాడి జరిగింది. కర్రలు, రాడ్లతో బస్సును ధ్వంసం చేశారు. అక్కడి క్యాబ్ డ్రైవర్లు మాకు సహకరించారని చెప్పారు.

ఆందోళనల నేపథ్యంలో మూడు రోజులు హోటల్‌లోనే ఉండిపోయాం. మా హోటల్ లోకి ఆందోళనకారులు చొరబడ్డారు. దొరికిన వస్తువులు ఎత్తుకెళ్లారు. అక్కడి పరిస్థితిని చూస్తే మళ్లీ ఏపీకి తిరిగి వెళ్తామా అనే భయంతో వణికిపోయాం. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో సురక్షితంగా తిరిగొచ్చామని నేపాల్ నుంచి వచ్చిన ప్రయాణికులు పేర్కొన్నారు.