Andhra Pradesh : ఏపీ మంత్రి ఛాంబర్‌కు తాళం.. 8నెలలుగా జీతాల్లేవంటూ తాళం వేసిన సచివాలయ సిబ్బంది

Andhra Pradesh : ఇప్పటికైనా మంత్రి లేదా ఉన్నతాధికారులు స్పందించాలని.. తమకు చెల్లించాల్సిన పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు.

Andhra Pradesh : ఏపీ మంత్రి ఛాంబర్‌కు తాళం.. 8నెలలుగా జీతాల్లేవంటూ తాళం వేసిన సచివాలయ సిబ్బంది

Andhra Pradesh - Secretariat

Updated On : June 12, 2023 / 5:34 PM IST

Andhra Pradesh – Secretariat : ఏపీ సెక్రటేరియట్ లోని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేషీ మూతపడింది. మంత్రి ఛాంబర్ కు సచివాలయ సిబ్బంది తాళం వేశారు. 8 నెలలుగా జీతాలు లేవంటూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఈ పని చేశారు. డిసెంబర్ నెల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులకు హాజరుకావడం లేదు. ఇప్పుడు ఏకంగా మంత్రి పేషీకి తాళం కూడా వేశారు.

సాధారణంగా.. మంత్రి పేషీ రోజూ తెరుచుకునేది. అధికారులు, సిబ్బంది వచ్చి తమ విధులు నిర్వర్తించే వారు. అయితే, 8 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో మనస్తాపానికి గురైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. మంత్రి ఛాంబర్ కి తాళం వేశారు. జీతాల విషయం గురించి అధికార యంత్రాంగానికి, మంత్రికి ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం స్పందించకపోవడంతో ఉద్యోగులు తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. డిసెంబర్ నుంచి జీతాలు చెల్లించకపోవడంతో తాము ఎలా బతకాలని వాపోయారు.

Also Read..TDP MLC Ashok Babu: జగన్ పిల్లలకు మేనమామ కాదు.. దొంగ మామ..

ఈ పరిస్థితుల్లో మరో దారి లేక విధులకు హాజరుకావడం మానేశారు. శుక్రవారం విధులకు వచ్చిన సిబ్బంది.. ఇక డ్యూటీకి వచ్చేది లేదని అధికారులకు తెలిపారు. అయినప్పటికీ అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేకపోయింది. దాంతో సిబ్బంది.. మంత్రి ఛాంబర్ కి తాళం వేసి వెళ్లిపోయారు. మంత్రి పేషీకి వేసిన తాళం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో అధికారులు కూడా మంత్రి ఛాంబర్ కి రావడం లేదు. క్యాంపు కార్యాలయం వద్దే విధులు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. ఏకంగా సెక్రటేరియట్ లోని మంత్రి పేషీ మూతబడటం సంచలనంగా మారింది. ఛాంబర్ కి తాళం వేయడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. పరిపాలనకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఆగిపోయాయి. దాంతో అధికారులు మంత్రి క్యాంప్ ఆఫీసులో, ఎక్కడ వీలైతే అక్కడ విధులు నిర్వహిస్తున్నారు.

Also Read..TS High Court : ‘ఇదో పబ్లిక్‌ న్యూసెన్స్‌’ పిటిషన్‌.. హరిరామ జోగయ్యపై టీఎస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

మరో దారి లేక, తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము విధులకు దూరంగా ఉంటున్నామని, మంత్రి పేషీకి తాళం వేశామని ఔట్ సోర్సింగ్ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికైనా మంత్రి లేదా ఉన్నతాధికారులు స్పందించాలని.. తమకు చెల్లించాల్సిన పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు. మొత్తంగా సచివాలయంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.