AP SSC Results 2023 (Photo : Google)
AP SSC Results 2023 : ఏపీలో టెన్త్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపే (మే 6) రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాల (SSC Results) విడుదల తేదీని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మే 6వ తేదీన ఉదయం 11 గంటలకు పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్లు మంత్రి బొత్స తెలిపారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదవ తరగతి పరీక్షా ఫలితాలను 18 రోజుల్లోనే(పరీక్షలు అయిపోయిన) విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతేడాది టెన్త్ పరీక్షలు అయిపోయిన 28 రోజుల్లో రిజల్ట్స్ విడుదల చేయగా, ఈ ఏడాది 18 రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఎక్కడా ఏ విధమైన లీకేజీ లేకుండా పూర్తి పారదర్శకంగా పని చేశామన్నారు మంత్రి బొత్స.
పదో తరగతి పరీక్షలను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించామని, ఉపాధ్యాయులు కూడా బాగా పని చేశారని మంత్రి బొత్స అభినందించారు. ఇక, 10 రోజుల్లో టీచర్ల బదిలీ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. విద్యార్థులు https://www.bse.ap.gov.in/ లింక్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. 6 పేపర్లతో టెన్త్ ఎగ్జామ్స్ జరిగాయి. పదోతరగతి పరీక్షలకు రాష్ట్రంలో 6లక్షల 10వేల మంది రెగ్యులర్, 55వేల మంది ప్రైవేటు విద్యార్థులు హాజరయ్యారు.
ఏపీలో ఏప్రిల్ 18న ఎస్ఎస్ సీ పరీక్షలు ముగిశాయి. ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకు వాల్యుయేషన్ జరిగింది. 35వేల మంది టీచర్లు ఈ స్పాట్ వాల్యుయేషన్ ను విజయవంతంగా నిర్వహించారు. పరీక్షలు ముగిసిన 18 రోజుల్లోపే వాల్యుయేషన్, టేబులేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయడం విశేషం. కాగా, టెన్త్ రిజల్ట్స్ ను మే రెండో వారంలో విడుదల చేస్తామని అధికారులు గతంలో తెలిపారు.
సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యాకానుకను ఒకే కిట్ గా చేసి స్కూల్ పాయింట్లకి పంపిస్తామన్నారు మంత్రి బొత్స. పాఠశాల ప్రారంభమైన తొలి మూడు రోజుల్లో విద్యా కానుక అందిస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే దానిపై దృష్టి పెట్టామన్నారు. పిల్లలకు మంచి విద్య అందించేలా ప్రభుత్వం కొత్త విధానాలు అమలు చేస్తోందన్నారు.