రాజధానుల ప్రకటన రగడ : అమరావతి రైతుల ఆగ్రహం..రోడ్డుపై బైఠాయింపు

  • Publish Date - December 18, 2019 / 04:44 AM IST

మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్స్ సెగ పుట్టిస్తున్నాయి. రాజకీయ రగడకు తెరలేపింది. అమరావతి రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానుల ఆలోచన మానుకోవాలని, లేనిపక్షంలో తాము ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 2019, డిసెంబర్ 18వ తేదీ బుధవారం ఉదయం రాజధానికి భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కారు.

అసెంబ్లీకి వెళ్లే రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. వెంకటపాలెం రైతులు రిలే నిరహార దీక్షకు దిగారు. పిల్లల భవిష్యత్ కోసమే..గత ప్రభుత్వానికి భూములు ఇచ్చామనే విషయాన్ని వారు గుర్తు చేశారు. తమకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాల్సిందేనని రైతులు తేల్చిచెప్పారు. సీఎం జగన్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే..ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

తమకు రాజధాని ఇక్కడే ఉండాలని, గవర్నమెంట్ సెక్టార్ ఇక్కడే ఉంటుందన్నారు. ప్రభుత్వాన్ని నమ్ముకునే తామున్నామని, ఎంతో మందికి ఉపాధి వచ్చిందని, ప్రాంతాల మధ్య విబేధాలు సీఎం జగన్ సృష్టించారని మండిపడ్డారు. సౌతాప్రికాతో పోలుస్తారా ?అంటూ నిలదీశారు. ఓ వర్గం, కులం కోసం చూడవద్దన్నారు. మూడు రాజధానుల ఆలోచన మానుకోవాలని సూచించారు. 

* సౌతాఫ్రికా తరహాలో ఏపీలో మూడు రాజధానులు ఉండే అవకాశముందని డిసెంబర్ 17వ తేదీ మంగళవారం జగన్ అసెంబ్లీలో చెప్పారు. 
* అమరావతిలో చట్టసభలు ఉంటాయి
* విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఉంటుంది
* హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయవచ్చు: జగన్
 

* విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెడితే పెద్దగా ఖర్చవదు
* ఉద్యోగులు పనిచేయడానికి కావాల్సిన సదుపాయాలన్నీ విశాఖలో ఉన్నాయి
* విశాఖలో ఒక మెట్రోరైలు వేస్తే సరిపోతుందన్న జగన్‌
* ఆ దిశగా ప్రతిపాదనల కోసం ఓ కమిటీని నియమించాం
* మరో వారంలో ఆ కమిటీ నివేదిక వస్తుంది: సీఎం జగన్