Vizag Gopinadh
Vizag Gopinath iaf flying officer: చదవుకోవాలనే ఆశ..ఉన్నతస్థాయికి ఎదగాలనే ఆకాంక్ష ఉంటే చాలు..చిన్ననాటి కలల్ని నెరవేర్చుకోవటానికి ఇవి చాలు అని మరోసారి నిరూపించాడు విశాఖపట్నంలోని ఓ ఆటో డ్రౌవర్ కొడుకు గోపీనాథ్. పెద్ద పెద్ద కలలు కనండీ..వాటిని సాకారం చేసుకోవటానికి కృషి చేయండి అని స్ఫూర్తి ప్రదాన అబ్దుల్ కలాం చెప్పిన మాటల్ని అక్షరాలా నెరవేర్చి పేదింటి కొడుకు ఆకాశంలో గెలుపు సంతకం చేసి కన్నవారి కలల్ని నెరవేర్చాడు. ‘‘ఆటో డ్రైవర్ కొడుకు ఎయిర్‌ఫోర్స్ ఫ్లయింగ్ ఆఫీసర్’’ అయ్యాడు. తన కలల్ని సాకారం చేసుకోవటమే కాకుండా కన్నవారిని తల ఎత్తుకునేలా చేశాడు. కొడుకు పుట్టినప్పుడు కంటే ఆ కొడుకు ప్రయోజకుడు అయితే ఆ తండ్రి పడే ఆనందం అంతా ఇంతా కాదు..నా చేయి పట్టుకుని నడిచిన నా కుమారుడిని నేను ఇప్పుడు చూడాలంటే ఆకాశంలోకి చూడాలని ఆ తండ్రి తెగ మురిసిపోతున్నాడు.
విశాఖపట్టణానికి చెందిన జి.గోపీనాథ్. ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా నియమితుడయ్యాడు. గోపినాథ్ ఓ సాధారణ ఆటో డ్రైవర్ సూరిబాబు కొడుకు. హైదరాబాలోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన గ్రాడుయేషన్ కార్యక్రమంలో గోపీనాథ్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టాడు. గోపీనాథ్ తండ్రి సూరిబాబు 25 సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అరిలోవాలోని ఎస్ఐజీ నగర్లో సూరిబాబు కుటుంబం నివసిస్తోంది. తాను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కష్టపడుతున్నా..తన కొడుకు మాత్రం తనలా కష్టపడకూడదనుకున్నాడు సూరిబాబు. అందుకే ఆర్థిక కష్టాలు ఉన్నాగానీ గోపీనాథ్‌ను చదివించటానికి ఎంత ఖర్చు అయినా ఏమాత్రం వెనుకాడలేదు.
ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలనుకున్న కొడుని ప్రోత్సహించారు. కొడుకు కోరుకున్నదాన్ని అందించాలనే తండ్రిగా తన భాధ్యత..అలాగే కొడుకు తనలా కష్టపడకుండా పెద్ద స్థాయిలో ఉండాలనే ఓ తండ్రి పడే తపన ఫలితంగా గోపీనాథ్ ఆఫీసర్ అయ్యాడు. తన కల..తండ్రి ఆకాంక్ష నెరవేర్చుకోవటానికి గోపీనాథ్ ఎంతో కష్టపడి ఎయిర్ ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా ఉన్నత స్థానం సాధించాడు. ఈ సంవత్సరం ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ‘ఒకేఒక్కడు’ విశాఖ గోపీనాథ్ కావటం విశేషం.
గోపీనాథ్ తాత ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. తండ్రి మాత్రం ఆటో డ్రైవర్ గా కష్టపడి తనను చదివిస్తుంటే తండ్రిని కష్టపెట్టకూడదనుకున్నాడు. ఎప్పుడైనా కష్టమొచ్చి అవసరం అయిన డబ్బు చేతిలో లేకపోతే కొడుకు చదువు ఆగిపోతుందనే భయంతో సూరిబాబు ఇంజనీరింగ్ చదవటానికి లోన్ తీసుకుందాం..లోన్ నేను కడతాను..అన్నారు. కానీ తండ్రి కష్టపడకూడదని తాతలా సైన్యంలో చేరాలనుకుని..డిగ్రీలో చేరాడు. తరువాత మొదటిగా ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మ్యాన్‌గా చేరాడు. అయితే ఆఫీసర్ తండ్రి ఆశను తన ఆకాంక్షను కావాలన్న ఆశను మాత్రం కొనసాగించాడు.
ఐఏఎఫ్‌లో చేరాక గోపీనాథ్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ను ఆంధ్రా యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్‌లో పూర్తి చేశాడు. గత సంవత్సరం క్రిప్టోగ్రాఫర్గా ప్రమోషన్ పొందాడు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షల్లో అర్హత సాధించాకే గోపీనాథ్ ఐఏఎఫ్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాడు. అటు తండ్రి కలను నెరవేర్చాడు.ఇటు తాతలా సైన్యంలో చేరాలనే కలతో పాటు తన ఆకాంక్షల్ని కూడా నెరవేర్చుకున్నాడు ఆటో డ్రైవర్ కొడుకు గోపీనాథ్.