AP Summer Heat: ఏపీలో మండిపోతున్న ఎండలు.. బుధవారం వరకు ఇంతే.. ఆ సమయంలో బయటకు రావొద్దు..

శనివారం 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. 221 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది. కోస్తా జిల్లాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంది.

  • Updated on- May 22, 2026 / 06:19 PM IST

AP Summer Heat: ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తణుకులో 44.8 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయ్యింది. దేవరాపల్లి, తొర్రగుడిపాడులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 67 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం ఎండల తీవ్రతకు అద్దం పడుతుంది. కాగా, రాష్ట్రంలో బుధవారం వరకు ఎండల తీవ్రత కొనసాగొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

శనివారం 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. 221 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది. కోస్తా జిల్లాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావొద్దని చెప్పింది. అత్యవసర పనులు ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలంది. ఎండలో తిరగాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేసింది. వడదెబ్బ బారిన పడకుండా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలంది. వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పింది.

అటు రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు, పశుకాపరులు జాగ్రత్తగా ఉండాలంది. పిడుగులతో కూడిన వానలు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద నిలబడొద్దని సూచించింది.

Also Read: నిప్పుల వర్షం.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఇవాళ, రేపు రెడ్ అలర్ట్.. బయటకు రావొద్దు.. వామ్మో.. ఇవేం ఎండలు సామీ..