అచ్చెన్నాయుడుకు సొంత గ్రామంలో బంధువు నుంచే తిరుగుబాటు!

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయడు సొంత ఊరిలో పంచాయతీ ఎన్నికల సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కింజారపు అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కింజరపు అప్పన్నను బరిలో నిలపడంతో గొడవ మొదలైంది. వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకోగా.. నిమ్మాడ నుంచి వైసీపీ తరఫున కింజరాపు అప్పన్న సర్పంచ్‌గా పోటీకి దిగాడు.

అప్పన్న.. అచ్చెన్నాయుడు అన్న కుమారుడు కాగా.. అప్పన్న నామినేషన్‌ వేయొద్దని అచ్చెన్నాయుడు ఫోన్‌ చేసి బెదిరించినట్లు వైసీపీ ఆరోపణలు చేస్తోంది. నిమ్మాడలో ఇప్పటి వరకు తనను పట్టించుకోలేదని అప్పన్న ఆవేదన వ్యక్తం చేస్తూ పోటీకి దిగాడు. వైసీపీ అభ్యర్థి కింజరాపు అప్పన్నకు అండగా.. దువ్వాడ శ్రీనివాస్‌ రావడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దువ్వాడతో సహా నామినేషన్‌ వేసే అభ్యర్థిని నామినేషన్‌ కేంద్రంలోకి రాకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పోలీసులు, టీడీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది.

నామినేషన్ వేసేందుకు వచ్చిన అప్పన్నను అడ్డుకోగా.. సపోర్ట్‌గా వచ్చిన వైసీపీ ఇన్‌ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ కారును కార్యకర్తలు అడ్డుకున్నారు. నామినేషన్ వేయకుండా అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలకు, వైసీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చేసుకోగా.. ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కింజారపు అప్పన్న.. అచ్చెన్నాయుడుకు సమీప బంధువు కాగా.. అచ్చెన్నాయుడు ఫోన్ చేసి నామినేషన్ వెయ్యొద్దు అని చెప్పినట్లుగా తెలుస్తోంది.

అయినా వినని అప్పన్న.. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని, నామినేషన్ వేయబోతున్నట్లు చెబుతున్నారు.