Amaravati Farmers Plots: రాజధాని రైతులకు ఈ-లాట‌రీ ద్వారా ప్లాట్ల కేటాయింపు..

ప‌ల్ల‌పు ప్రాంతాలు, స‌మాధుల స‌మీపంలో ప్లాట్లు కేటాయిస్తున్నార‌నేది కొంత‌మంది అపోహ‌ మాత్ర‌మే అని స్పష్టం చేశారు.

Amaravati Farmers Plots: రాజధాని రైతులకు ఈ-లాట‌రీ ద్వారా ప్లాట్ల కేటాయింపు..

Amaravati Representative Image (Image Credit To Original Source)

Updated On : January 23, 2026 / 6:32 PM IST
  • రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్లు
  • దశలవారీగా స్థలాల పంపిణీ
  • నిబంధనల ప్రకారమే ఈ-లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు

Amaravati Farmers Plots: ఏపీ రాజధాని అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు జరిగింది. ఈ-లాటరీ ద్వారా 115 ప్లాట్లు కేటాయించారు సీఆర్డీఏ అధికారులు. నిబంధ‌న‌ల ప్ర‌కారం పూర్తి పార‌ద‌ర్శ‌కంగా ప్లాట్ల‌ను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. రోడ్లు శూల లేని, ల్యాండ్ అక్విజిష‌న్ స్థ‌లంలో లేని ప్లాట్లు మాత్ర‌మే కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప‌ల్ల‌పు ప్రాంతాలు, స‌మాధుల స‌మీపంలో ప్లాట్లు కేటాయిస్తున్నార‌నేది కొంత‌మంది అపోహ‌ మాత్ర‌మే అని స్పష్టం చేశారు. ద‌క్షిణ ముఖంగా వ‌చ్చిన ప్లాట్లను మొద‌టి నుంచి రోడ్డు శూల ప్లాటుగా ప‌రిగ‌ణించ‌లేదన్నారు. రిట‌ర్న‌బుల్ ప్లాట్ లేఔట్ రూల్స్ ప్ర‌కార‌మే మొత్తం ప్ర‌క్రియ జ‌రిగిందని సీఆర్డీఏ అధికారులు వెల్లడించారు.

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తోంది ప్రభుత్వం. దశలవారీగా స్థలాలను పంపిణీ చేస్తోంది. రాజధాని నిర్మాణానికి ఉండవల్లిలో 201 మంది రైతులు మెట్ట భూములు ఇచ్చారు. మరో 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లను సీఆర్‌డీఏ అధికారులు ఇవాళ కేటాయించారు.

కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఒకవైపు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూనే, మరోవైపు భవిష్యత్ అవసరాలు, విస్తరణ కోసం భూ సేకరణ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగుగా అభివర్ణిస్తున్నారు. రాయపూడిలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయింపు జరిగింది. స్థలాల కేటాయింపు ప్రక్రియను చాలా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు సీఆర్‌డీఏ అధికారులు తేల్చి చెప్పారు. 2019కి ముందు రూపొందించిన నిబంధనల ప్రకారమే ఈ-లాటరీ విధానాన్ని అమలు చేస్తున్నామని, దీంతో ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదని చెబుతున్నారు.

ఇక రెండో దశలో భూసమీకరణలో భాగంగా భూములిచ్చే రైతులకు కూడా ఇదే పద్ధతిలో స్థలాలను కేటాయించనున్నారు. తొలి దశలో భూములు ఇచ్చిన రైతులకు, వారి గ్రామానికి సమీపంలోనే ఉన్న లేఔట్లలో స్థలాలను కేటాయిస్తున్నారు.

Also Read: ఏపీలో త్వరలో సోషల్ మీడియా బ్యాన్..! ఆస్ట్రేలియా మాదిరి చట్టంకు కసరత్తు?