ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ కాటేస్తోంది. కేసుల సంఖ్ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 02వ తేదీ గురువారం మరో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని స్టేట్ నోడల్ ఆఫీసర్ డా. శ్రీకాంత్ వెల్లడించారు. ఈ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని నాలుగు సెంటర్లతో పాటు..మరో 2 టెస్టింగ్ సెంటర్లను గుంటూరు, కడపలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
నిజాముద్దీన్ మర్కజ్ భవన్ లో తబ్లిగ్ జమాత్ లో జరిగిన సమావేశానికి ఏపీ నుంచి 1085 హాజరైనట్లు గుర్తించామన్నారు. వీరిలో ఇప్పటికే 758 మందిని గుర్తించి..శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కు పంపించామన్నారు. 758 మందిలో 91 మందికి పాజిటివ్ గా వచ్చిందని, ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో దాదాపు 16 శాతం మందికి కరోనా వైరస్ వచ్చిందన్నారు.
గుంటూరులో క్వాలిటీ టెస్టు చేసి..శుక్రవారం నుంచి పరీక్షలు చేయడం మొదలు పెడుతామన్నారు. కడపలో శుక్రవారం క్వాలిటీ టెస్ట్ చేసి, 04వ తేదీ నుంచి టెస్టింగ్ మొదలు పెట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం దీనితో కలిపి టెస్టింగ్ ల సంఖ్య 450 నుంచి 570కి పెరుగుతుందన్నారు. విశాఖలో మరొక టెస్టింగ్ సెంటర్ కూడ సిద్ధమవుతోందన్నారు. ప్రస్తుతం 4 ల్యాబ్ లు, 24 గంటలు టెస్టింగ్ ల్లో నిమగ్నమై ఉన్నాయన్నారు.
ఈ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ ల (PPE) విషయమై ఏపీ ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. PPEలకు కావాల్సిన 90 GSM నాన్ నొవెన్ ఫ్యాబ్రిక్ సప్లయిుర్స్ తో మాట్లాడడం జరిగిందని, కొన్ని శాంపిల్స్ ను పరిశీలించినట్లు చెప్పారు. ప్రతి జిల్లా ఆసుపత్రికి వెయ్యి పీపీఈలను ఇవ్వాల్సిందిగ ఆదేశించినట్లు తెలిపారు.