Exam
APPSC Group 2 Mains Exam Date: : ఏపీలో గ్రూప్-2 ప్రధాన పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించాలని ఏపీపీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించిన తరువాత అధికారిక ప్రకటనను విడుదల చేయనున్నట్లు సమాచారం. గ్రూప్-2 ప్రధాన పరీక్ష తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 5వ తేదీన జరగాల్సి ఉంది. డీఎస్సీ నోటిపికేషన్ జారీ, పరీక్షా కేంద్రాల గుర్తింపు, అభ్యర్ధుల సన్నద్ధతను దృష్టిలో పెట్టుకొని ఈ తేదీని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ గతంలో వెల్లడించింది. అయితే, డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడడంతో పాటు అభ్యర్థల నుంచి వస్తున్న వినతుల మేరకు గ్రూప్-2 ప్రధాన పరీక్ష తేదీని జనవరి 5వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీకి మార్చేందుకు ఏపీపీఎస్సీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read: Gossip Garage : నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నదెవరు? ఎమ్మెల్సీ కోసమే పట్టుబడుతున్న లీడర్లు ఎవరు?
గతేడాది డిసెంబర్ 7న 897 ఉద్యోగాల భర్తీకి గత ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ -2కు 4,83,535 మంది అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టుకోగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 4లక్షల4వేల37 మంది హాజరయ్యారు. వారిలో 92,250 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు. ఈ ఏడాది జూలై 28న మెయిన్స్ (ప్రధాన) పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, అభ్యర్థుల విజ్ఞప్తితో కూటమి సర్కార్ పరీక్ష తేదీని వాయిదా వేశారు. పెండింగ్ లో ఉన్న ఖాళీల భర్తీకి కార్యాచరణ రూపొందించి వచ్చే ఏడాది జనవరి 5న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, సమయం తక్కువగా ఉండటం వల్ల మరింత సమయం ఇవ్వాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాప్రతినిధులు సైతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్ పర్సన్ ను కలిసి ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షను నిర్వహించాలని కోరారు.
నిరుద్యోగ అభ్యర్థులు, ప్రజాప్రతినిధుల నుంచి పెద్దెత్తున విజ్ఞప్తులు రావడంతో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీని మార్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. జనవరి 5వ తేదీ జరగాల్సిన పరీక్షను నెలరోజులకుపైగా గడువు పెంచి ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించాలని ఏపీపీఎస్సీ యోచిస్తోంది. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించాక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.