Dwaraka Tirumala Rao : బస్సు టిక్కెట్ల ధరలు పెంచలేదు, డీజిల్ సెస్ మాత్రమే విధిస్తున్నాం – ఆర్టీసీ ఎండీ

డీజిల్ ధరల పెరగుదలతో ఈ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్ర‌స్తుతం పెంచుతున్న‌ది బ‌స్సు చార్జీల‌ను కాద‌ని..

Dwaraka Tirumala Rao

Dwaraka Tirumala Rao : ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ షాక్ ఇచ్చింది. ఆర్టీసీ ప్రయాణికులపై భారం మోపింది. ఆర్టీసీ ప్రయాణికులపై డీజిల్ సెస్ విధించారు. డీజిల్ సెస్ పెంపు గురించి ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఆర్టీసీ చార్జీలపై డీజిల్ సెస్ విధిస్తున్నట్లు ద్వారకా తిరుమలరావు తెలిపారు. డీజిల్ ధరల పెరగుదలతో ఈ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్ర‌స్తుతం పెంచుతున్న‌ది బ‌స్సు చార్జీల‌ను కాద‌ని చెప్పిన ఆయ‌న కేవ‌లం తాము టికెట్‌పై డీజిల్ సెస్ మాత్ర‌మే విధిస్తున్నామ‌ని వివరించారు.

డీజిల్ సెస్ పేరుతో పల్లె వెలుగు బస్సుల్లో రూ.2, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.5, ఏసీ బస్సుల్లో రూ.10 చొప్పున పెంచుతున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. అలాగే పల్లె వెలుగు బస్సుల్లో కనీస టికెట్ ధర రూ.10 అని చెప్పారు. ఈ ధరలు గురువారం (ఏప్రిల్ 14) నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.(Dwaraka Tirumala Rao)

”కేవ‌లం డీజిస్ సెస్‌ను మాత్ర‌మే పెంచుతున్నాం. పెరిగిన డీజిల్ చార్జీల కార‌ణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ప‌ల్లె వెలుగు, ఆర్డిన‌రీ స‌ర్వీసుల్లో రూ.2 మేర డీజిస్ సెస్ పెంచుతున్న‌ాం. ఎక్స్‌ప్రెస్‌, డీల‌క్స్‌, సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సుల్లో ఈ సెస్‌ను రూ.5గా పెంచుతున్నాం. ఇక ఏసీ బ‌స్సుల్లో రూ.10 పెంచుతున్న‌ాం. పెరిగిన ధ‌ర‌లు రేప‌టి నుంచే అమ‌ల్లోకి వ‌స్తాయి. ప‌ల్లె వెలుగు బ‌స్సుల్లో క‌నీస టికెట్ ధ‌ర‌ను రూ.10కి పెంచుతున్నాం” అని ద్వారకా తిరుమల రావు ప్ర‌క‌టించారు.

APS RTC Charges : ఏపీలో మరో బాదుడు.. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు.. రేపటినుంచే అమల్లోకి..!

” పెంచిన డీజిల్ సెస్ రేపటి (ఏప్రిల్ 14) నుంచి అమల్లోకి వస్తుంది. ప్రయాణికుడు బస్సు ఎక్కి దిగితే పల్లె వెలుగుపై 2 రూపాయలు.. ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీపై 5 రూపాయలు, హై అండ్ బస్సులకు పది రూపాయలు డీజిల్ సెస్ పెంచుతున్నాం. ఒకేసారి 32 శాతం చార్జీలు పెంచాల్సి వస్తుందనే డీజిల్ సెస్ విధానాన్ని తీసుకొచ్చాం. పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో కనీస టికెట్ ధర 10 రూపాయలుగా నిర్ణయించాం. డీజిల్ సెస్ 2 రూపాయలు, సేప్టీ సెస్ 1 రూపాయి.. మొత్తంగా చిల్లర సమస్య కారణంగా ప్రయాణికుడు గమ్యస్ధానాలకు చేరే క్రమంలో బస్సు ఎక్కి దిగితే టిక్కెట్ ధరను బట్టి 15, 20, 25 రూపాయలు రౌండ్ ఫిగర్ ఉంటుంది” అని ఆర్టీసీ ఎండీ తెలిపారు.

”41 లక్షల కిలోమీటర్లు ఏపీ ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. 20 లక్షల మంది ప్రయాణికులను గమ్య స్ధానాలకు చేరుస్తున్నాం. 2019 డిసెంబర్ లో డీజిల్ ధర 67 రూపాయలు ఉన్నప్పుడు ఒకసారి బస్సు చార్జీలు పెంచాం. ఇప్పుడు డీజిల్ రేటు 107 రూపాయలు పెరిగింది. బల్క్ రేటు ఇంకా ఉంది. గత రెండేళ్లలో రూ.5,680 కోట్లు ఆదాయానికి గండిపడింది. గతంలో కోవిడ్ సమయంలో నష్టాలు వచ్చినా బస్సు చార్జీలు పెంచలేదు. ఏపీ ఆర్టీసీ ప్రస్తుతం నిలదొక్కుకోలేని పరిస్ధితుల్లో ఉంది. తప్పనిసరి పరిస్ధితుల్లో డీజిల్ సెస్ పెంచుతున్నాం. డీజిల్ సెస్ మాత్రమే పెంచుతున్నాం. టిక్కెట్ల ధరలు యధాతధం. సెస్ విధానం వలన రూ.750 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. డీజిల్ పెంపు వలన రోజుకు మూడున్నర కోట్ల రూపాయల భారం పడుతోంది” అని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.

పొరుగునున్న టీఎస్ఆర్టీసీ కూడా డీజిల్ సెస్ విధించిందని.. సంస్థపై భారాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ఇక పెరిగిన ఇంధ‌న ధ‌ర‌ల కార‌ణంగా ఆర్టీసీపై ప‌డే న‌ష్టాల‌ను త‌గ్గించుకునేందుకు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషిస్తున్నామ‌ని, ఇందులో భాగంగా ఆర్టీసీ స్థ‌లాల‌ను లీజుకు ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

కాగా.. ఇంధ‌న ధ‌ర‌లు పెరిగిన నేప‌థ్యంలో ఇటీవ‌లే రెండు సార్లు ఆర్టీసీ బ‌స్సు చార్జీల‌ను పెంచుతూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ కూడా టీఎస్ ఆర్టీసీ బాటలోనే పయనించింది. ప్రయాణికులపై డీజిల్ సెస్ భారం వేసింది.