ఈ నియోజకవర్గం టీడీపీకి అచ్చిరావడం లేదా? ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించనుంది?

TDP: ఆమె ప్రస్తుతం బీజేపీలో ఉండటంతో... పొత్తు కుదిరితే ఆమెకు కేటాయించే చాన్స్‌ ఉందనే ప్రచారం ఎక్కువగా సాగుతోంది.

Araku Constituency TDP

ఏపీలో ఏకైక ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం అరకు.. టీడీపీకి అచ్చిరావడం లేదా? నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఏడు ఎస్టీ నియోజకవర్గాలను కలిపి ఏర్పాటు చేసిన ఈ నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం.. గిరిజన ఓటర్లే ఎక్కువగా ఉండే అరకులో టీడీపీ ఇంతవరకు ఒక్క విజయాన్ని నమోదు చేయలేకపోయింది… వరుసగా మూడు సార్లు పరాజయం ఎదుర్కొన్న తెలుగుదేశం.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించనుంది? అరకులో పోటీ చేయబోయే టీడీపీ అభ్యర్థులు ఎవరు?

ఎస్టీ నియోజకవర్గం అరకు రాజకీయం ఎప్పుడూ ఆసక్తికరమే.. కొండలు, లోయలతో కూడిన ఏజెన్సీ ప్రాంతంతోపాటు… మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ వంటి మైదాన ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. పాలకొండ నుంచి రంపచోడవరం విస్తరించిన అరకు నియోజకవర్గంలో పూర్తిగా తిరిగిన నేతలూ ఉండరంటే అతిశయోక్తి కాదు… ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం ఉండటం.. మారుమూల ప్రాంతాలకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఏ పార్టీ ప్రజాప్రతినిధులైనా స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

మైదాన ప్రాంతాలతో పోలిస్తే?
ఐతే మైదాన ప్రాంతాలతో పోలిస్తే అరకు తీర్పు కాస్త భిన్నంగా ఉంటుంది. 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గానికి ఇప్పటికి మూడు సార్లు ఎన్నికలు జరిగితే… ఒకసారి కాంగ్రెస్‌, రెండుసార్లు వైసీపీ గెలుపొందింది. 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా.. ఇక్కడ ఖాతా తెరవలేకపోయింది టీడీపీ… వచ్చే ఎన్నికల్లో అయినా అరకులో టీడీపీ బోణీ చేస్తుందా? లేదా? అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఇప్పటివరకు అరకు ఎంపీ అభ్యర్థి ఎవరన్నదానిపై టీడీపీ-జనసేన కూటమిలో క్లారిటీ లేకపోవడం… మరోవైపు అధికార వైసీపీ ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించి దూకుడు చూపిస్తుండటంతో అరకు రాజకీయం ఆసక్తి రేపుతోంది.

గత మూడు ఎన్నికల్లో రెండుసార్లు మాత్రమే టీడీపీ పోటీ చేసింది. 2009లో మహాకూటమిలో భాగంగా కమ్యూనిస్టులకు వదిలేసింది. 2014లో విజయనగరం జిల్లాకు చెందిన గుమ్మడి సంధ్యారాణి, 2019లో వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్‌ టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారు. వీరిద్దరిలో కిశోర్‌చంద్రదేవ్‌ ప్రస్తుతం టీడీపీకి రాజీనామా చేయగా, గుమ్మడి సంధ్యారాణి సాలూరు అసెంబ్లీ టికెట్‌ ఆశిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అరకు ఎంపీ అభ్యర్థిని వెతుకులాట ప్రారంభించింది టీడీపీ.

2014లో అరకు ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత
అయితే తమకు కలిసిరాని అరకు సీటును టీడీపీ తన మిత్రపక్షాలకు వదిలేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఐతే జనసేన లేదంటే బీజేపీతో పొత్తులో ఆ పార్టీకి కేటాయించే చాన్స్‌ ఉందనే ప్రచారం జరుగుతోంది. 2014లో అరకు ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత మళ్లీ పోటీ చేయాలని చూస్తున్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీలో ఉండటంతో… పొత్తు కుదిరితే ఆమెకు కేటాయించే చాన్స్‌ ఉందనే ప్రచారం ఎక్కువగా సాగుతోంది.

అయితే అరకు సీటును వదులుకోవడంపై టీడీపీలో కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. అధికార పార్టీపై ఆదివాసీల్లో అసంతృప్తి పెరుగుతున్నందున టీడీపీ పోటీ చేస్తే బాగుంటుందనే వాదన వినిపిస్తోంది. ఈ పార్లమెంట్‌ పరిధిలో ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తుండటంతో లోక్‌సభకు టీడీపీ అభ్యర్థిని నిలపాలని డిమాండ్‌ వస్తోంది. దీంతో టీడీపీ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ కనిపిస్తోంది. టీడీపీ తనకు అచ్చిరాని నియోజకవర్గం అనవాయితీకి ఈ ఎన్నికలతో పుల్‌స్టాప్‌ పెడుతుందా? లేక మిత్రపక్షాలకు వదిలేసి చేతులు దులుపుకుంటుందా? అన్నదే చూడాల్సివుంది.

Nagababu: ఎన్నికల వేళ.. తుఫాన్‌లా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు

ట్రెండింగ్ వార్తలు