Nagababu: ఎన్నికల వేళ.. తుఫాన్‌లా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు

బైరా దిలీప్‌ చక్రవర్తి గతంలో నాగబాబుతో కలిసి ప్రజారాజ్యంలో పనిచేసిన వారే కావడంతో... ఆయన బుజ్జగించడం

Nagababu: ఎన్నికల వేళ.. తుఫాన్‌లా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు

Nagababu

అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో జనసేన నేత నాగబాబు కాకరేపుతున్నారు. గత పది రోజులుగా అనకాపల్లి పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న నాగబాబు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే సంకేతాలు పంపుతుండటం హీట్‌ పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ సీటును ఆశిస్తున్న టీడీపీ-జనసేన కూటమిలోని నేతలు నాగబాబు ఎంట్రీతో కలవరపాటుకు గురవుతున్నారు….. అసలు నాగబాబు అనకాపల్లిపై కన్నేయడానికి కారణమేంటి? నాగబాబు ఎంట్రీతో టీడీపీ-జనసేన నేతల ఆశలు అడియాసలేనా?

ఉత్తరాంధ్రలోని కీలకమైన అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా టీడీపీ-జనసేన పార్టీలకు ఈ సీటు చిక్కుముడిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రెండు పార్టీల నుంచి పలువురు నేతలు అనకాపల్లి నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని కోరుకుంటుండటం… ఇప్పుడు సడన్‌గా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు నాగబాబు అనకాపల్లిలో కర్చీఫ్‌ వేయడంతో రాజకీయం ఆసక్తి రేపుతోంది. జనసేనాని పవన్‌ సోదరుడైన నాగబాబు పోటీకి వస్తే తమ పరిస్థితి ఏంటని టెన్షన్‌ పడుతున్నారు స్థానిక నేతలు.

అనకాపల్లిని పెండింగ్‌లో పెట్టిన వైసీపీ
అనకాపల్లి సిట్టింగ్‌ ఎంపీ డాక్టర్‌ భీశెట్టి సత్యవతి వైసీపీ కాగా, ఆమెకు కూడా ఇంతవరకు టికెట్‌ కన్ఫార్మ్‌ కాలేదు. రాష్ట్రంలో సుమారు 17 ఎంపీ స్థానాల్లో మార్పులు చేపట్టిన వైసీపీ… అనకాపల్లిని ఇంకా పెండింగ్‌లో పెట్టింది. ఇక్కడి నుంచి రాష్ట్రమంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో సహా పలువురి పేర్లు పరిశీలిస్తోంది. ఇదేసమయంలో టీడీపీ-జనసేన కూటమి నుంచి చాలా మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్‌తోపాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి భైరా దిలీప్‌ చక్రవర్తితో పాటు జనసేన నేత కొణతాల రామకృష్ణ పేర్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నాయి. ముఖ్యంగా చింతకాయల విజయ్‌ తనకు అవకాశం ఇవ్వాలని పార్టీపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. దిలీప్‌ చక్రవర్తి అయితే తనదే టికెట్‌ అనే నమ్మకంతో కార్యకర్తలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. మరోవైపు లోక్‌సభకు పోటీచేయాలన్న ఉద్దేశంతోనే సీనియర్‌ నేత కొణతాల రామకృష్ణ కూడా ఇటీవలే జనసేనలో చేరారు.

ఇలా ముగ్గురు నేతలు ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకోగా, నాగబాబు తుఫాన్‌లా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ముగ్గురు నేతలు షాక్‌ తిన్నారు. ఐతే తన రాకతో ఆశావహులు అసంతృప్తి చెందుతున్నారని పసిగట్టిన నాగబాబు… వారిలో అసంతృప్తి పోగొట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టడంతో అనకాపల్లిలో నాగబాబు ఖాయంగా పోటీ చేస్తారనే టాక్‌ ఊపందుకుంది.

కొణతాల రామకృష్ణ వ్యతిరేకత
నాగబాబు వచ్చినా.. ఆయన కార్యక్రమాలకు వెళ్లకుండా ముఖం చాటేసిన కొణతాల రామకృష్ణ తన వ్యతిరేకత తెలియజేశారు. ఇది గ్రహించి నాగబాబు నేరుగా రామకృష్ణ ఇంటికి వెళ్లడంతో ఆయనలో అసంతృప్తి చల్లారిందని అంటున్నారు. సొంతపార్టీని చక్కబెట్టుకున్న నాగబాబు.. టీడీపీ నేతలను ఎలా దారికి తెచ్చుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

అనకాపల్లి సీటు ఆశిస్తున్న ఇద్దరు టీడీపీ నేతల్లో ఒకరైన బైరా దిలీప్‌ చక్రవర్తి గతంలో నాగబాబుతో కలిసి ప్రజారాజ్యంలో పనిచేసిన వారే కావడంతో… ఆయన బుజ్జగించడం తేలికైన పనిగా భావిస్తోంది జనసేన. ఇక చింతకాయల విజయ్‌ మద్దతు కూడగట్టడమే నాగబాబు ముందున్న అతిపెద్ద సవాల్‌ అంటున్నారు పరిశీలకులు.

అనకాపల్లి లోక్‌సభ పరిధిలో అయ్యన్నపాత్రుడికి విస్తృత పరిచయాలు ఉండటంతో ఆయన సహకరిస్తే గెలుపు ఈజీగా భావిస్తున్నారు. తన కుమారుడికి సీటు ఆశిస్తున్న అయ్యన్న నాగబాబును స్వాగతిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు అనకాపల్లిపై ఫోకస్‌ పెట్టిన నాగబాబు… తన పని చకచకా చేసుకుపోతున్నారు. స్థానికేతరుడనే విమర్శలు తలెత్తకుండా ముందుజాగ్రత్తగా ఎలమంచిలి లేదా అచ్యుతాపురంల్లో ఎక్కడో ఓ చోట ఇల్లు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే అచ్యుతాపురంలో ఓ జనసేన లీడర్‌ ఇంటిని పరిశీలించారంటున్నారు. నాగబాబు ఏర్పాట్లు పరిశీలిస్తే.. వచ్చే ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేయడం ఖాయమనే అంటున్నారు పరిశీలకులు.

Pawan Kalyan Vizag Tour : విశాఖలో రెండు రోజుల పవన్ పర్యటన ఖరారు