Murali Nayak: అగ్నివీరుడా వందనం.. ఇవాళ స్వగ్రామానికి జవాన్ మురళీ నాయక్ పార్దివదేహం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు

మురళినాయక్ స్వస్థలం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండా. మురళికి చిన్నతనం నుండే దేశభక్తి ఎక్కువ.

Jawan Murali Nayak

Murali Nayak: భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ సరిహద్దులో సేవలు అందిస్తూ గురువారం అర్ధరాత్రి పాక్ తో జరిగిన ఎదురు కాల్పుల్లో తెలుగుబిడ్డ జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. మురళి నాయక్ మృతితో తండ్రి శ్రీరాంనాయక్, తల్లి జ్యోతిబాయి, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నాయి. మురళినాయక్ స్వస్థలం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండా. మురళికి చిన్నతనం నుండే దేశభక్తి ఎక్కువ. దీంతో.. రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఆర్మీ చేరాడు. 2022 డిసెంబర్ లో గుంటూరులో జరిగిన ఎంపిక ప్రక్రియలో అగ్నివీర్ గా ఎంపికయ్యి బోర్డర్ లో సేవలందిస్తున్నారు.

 

మురళి నాయక్ మృతదేహం ఇవాళ సాయంత్రం 6గంటలకు గోరంట్ల మండలం కళ్లితాండా గ్రామానికి చేరుకోనున్నట్లు సమాచారం. జవాన్ మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో ఏపీ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించనుంది. జవాన్ అంత్యక్రియల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మురళి నాయక్ కుటుంబానికి ఒకనెల జీతం అందించారు. శుక్రవారం మురళీనాయక్ కుటుంబాన్ని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పరామర్శించారు. రూ.5లక్షల చెక్కు అందజేశారు. ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు జవాన్ మురళి నాయక్ కుటుంబ సభ్యులను మహరాష్ట్ర డిప్యూటి సీఎం ఏక్ నాథ్ షిండే పరామర్శించనున్నారు.

 

2022లో గుటూరులో జరిగిన ఎంపికల్లో అగ్నివీర్ గా ఎంపికైన మురళీ నాయక్.. మొదట ఆరు నెలలు నాసిక్ లో ట్రైనింగ్ అయ్యారు. ట్రైనింగ్ తరువాత అస్సాంలో ఒక సంవత్సరంపాటు పనిచేశారు. తరువాత పంజాబ్ లో పనిచేస్తున్న జవాన్ మురళి నాయక్.. రెండురోజుల క్రితమే సరిహద్దుల్లో పాకిస్తాన్ తీవ్రవాదులతో తలపడేందుకు జమ్మూ కాశ్మీర్ కు వచ్చాడు. పాకిస్తాన్ తీవ్రవాదుల ఎదురుదాడిలో పోరాడి ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టి చివరకు తీవ్రవాదుల ఎదురు కాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందారు.